శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్
ABN , Publish Date - Nov 14 , 2026 | 02:57 AM
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలానికి దోర్నాల నుంచి నల్లమలలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది.
సుండిపెంట డ్యామ్ నుంచి దోర్నాల వరకూ..
43 కి.మీ. వంతెన నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ సర్వే
పెద్దదోర్నాల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలానికి దోర్నాల నుంచి నల్లమలలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. ఎన్‌హెచ్ 765 పరిధిలో నంద్యాల జిల్లా సుండిపెంట డ్యామ్ నుంచి మార్కాపురం జిల్లా దోర్నాల వరకు సుమారు 43 కిలోమీటర్ల దూరం వంతెనపై వెళ్లే హైవే (ఎలివేటెడ్ కారిడార్)ను నిర్మించాలని భావిస్తోంది. దీనికోసం అటవీశాఖ పర్యవేక్షణలో శ్రీజ్యోతి ఇంజనీరింగ్ సంస్థ ద్వారా నేషనల్ హైవే అథారిటీ బృందం ప్రత్యేక సర్వే చేపట్టింది. నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు నల్లమలలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.
ఎంతటి పర్వదినాలైనా (మహాశివరాత్రి, ఉగాది మినహాయించి) శ్రీశైలానికి ఘాట్ రోడ్డులో పగటి పూట మాత్రమే అనుమతిస్తారు. మరోవైపు రాష్ట్ర విభజన అనంతరం భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణానికి, వన్యప్రాణులకు ఎలాంటి విఘాతం కలగకుండా శ్రీశైలానికి తక్కువ సమయంలో నిరంతరం ప్రయాణం సాగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. దీంతో ఎలివేటెడ్ కారిడార్ అంశం తెరపైకి వచ్చింది.
30 మీటర్ల వెడల్పుతో పెద్దగా మూలమలుపులు లేకుండా పిల్లర్ల సహాయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు సర్వే అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అక్టోబరు 1 నుంచి సర్వే చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం, నెక్కంటి అటవీ రేంజ్ పరిధిలో సర్వే పూర్తయిందని, ప్రస్తుతం దోర్నాల రేంజ్ పరిధిలో చేస్తున్నామని, మరో 20 రోజుల సమయం పడుతుందని వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్