Green Ammonia Project: క్లీన్ ఎనర్జీలో మరో చరిత్ర!
ABN , Publish Date - Jan 17 , 2026 | 03:26 AM
క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ప్రపంచంలోనే అతిపెద్దది.. దేశంలోనే మొదటి గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు రాష్ట్రం వేదిక కానుంది.
కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ప్రపంచంలోనే పెద్దది.. దేశంలో మొదటిది
నేడు భారీ యంత్రాల ఏర్పాటుకు శ్రీకారం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
1.5 ఎంటీపీఏ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు
దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్
7.5 గిగావాట్ల సోలార్, విండ్ ఎనర్జీ కూడా
2 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంటు ఏర్పాటు
3 దశల్లో మొత్తం రూ.90 వేల కోట్ల పెట్టుబడి
2027 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం
గ్రీన్‌కోకు చెందిన ఏఎం గ్రీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
విశేషాలు ఎన్నెన్నో..
10 బిలియన్ డాలర్ల(సుమారు రూ.90 వేల కోట్లు) పెట్టుబడితో ఏర్పాటవు తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేస్తారు. తొలిదశలో 2027 నాటికి ఏడాదికి 0.5 టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
తొలిదశలో రూ.18 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. రెండో దశలో 2028 నాటికి 1 టన్ను, మూడో దశలో 1.5 టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.
దేశంలో తయారైన గ్రీన్ అమ్మోనియా విదేశాలకు ఎగుమతి కావడం కాకినాడ నుంచే ప్రారం భం కానుంది. గ్రీన్ అమ్మోని యాను భారీ రవాణా షిప్పులకు, భారీ ట్రక్కులకు, సరుకు రవాణా రైళ్లకు ఇంధనంగా వినియో గిస్తారు. విద్యుత్ ఉత్పత్తికి కూడా దీన్ని వినియోగిస్తారు. ఈ ప్రాజెక్టు కేవలం ఓ పారిశ్రామిక పెట్టుబడి మాత్రమే కాదు. రాష్ట్ర ఇంధన భవిష్యత్తుకు స్పష్టమైన దిశానిర్దేశం.
- మంత్రి లోకేశ్
అమరావతి/కాకినాడ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ప్రపంచంలోనే అతిపెద్దది.. దేశంలోనే మొదటి గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు రాష్ట్రం వేదిక కానుంది.
కాకినాడ కేంద్రంగా.. గ్రీన్‌కో గ్రూప్‌నకు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కాంప్లెక్స్ నుంచి గ్రీన్ అమ్మోనియా జర్మనీ, జపాన్‌కు ఎగుమతి కానుంది. కేవలం ఏడాది కాలంలో అన్ని అనుమతులూ పొంది శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న ఈ ప్రాజెక్టులో భారీ యంత్ర పరికరాల ఏర్పాటు ప్రక్రియకు శనివారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. గ్రీన్‌కో గ్రూప్‌నకు చెందిన ‘ఏఎం గ్రీన్’ సంస్థకు గత ఏడాది జనవరిలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తూ జీవో విడుదల చేసింది. 10 బిలియన్ యూఎస్ డాలర్ల(సుమారు రూ.90 వేల కోట్లు) పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో సు మారు 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆపరేషన్స్, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్, నిల్వ లు, పోర్టు సేవలు వంటి అనుబంధ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించనున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేసిన గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులు జర్మనీ, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి కానున్నాయి.
భవిష్యత్ ఇంధనం
ఏఎం గ్రీన్ సంస్థ.. గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించి కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయనుంది. బొగ్గు, చమురు, సహజవాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమ్మోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరగనుంది. ప్రపంచం మొత్తం డీ-కార్బనైజేషన్, నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా భవిష్యత్తు ఇంధనాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడలో ‘ఏఎం గ్రీన్ అమ్మోనియా’ ప్రాజెక్టు దేశానికే గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమ్మోనియా ప్లాంట్‌ను గ్రీన్ ప్లాంట్‌గా అభివృద్ధి చేస్తున్నారు. 495 ఎకరాల్లో ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేయనున్నారు. తొలిదశలో 2027 నాటికి ఏడాదికి 0.5 టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలిదశలో రూ.18 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. రెండో దశలో 2028 నాటికి టన్ను, మూడో దశలో 1.5 టన్నుల అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని దశల్లోనూ గ్రీన్ ఎనర్జీని మాత్రమే వినియోగించుకునే ఏకైక ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు దేశంలో ఇదేనని అధికారులు తెలిపారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి అవసరమయ్యే విద్యుత్తు కోసం 7.5 గిగావాట్ల సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి 1950ఎంవీ సామర్థ్యంతో ఎలక్ట్రోలైజర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్తును అందించేందుకు 2జీవీ సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టు అవసరాలన్నింటికీ గ్రీన్ ఎనర్జీని వినియోగించుకునే ప్లాంటు దేశంలో ఇదే మొదటిది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.90వేల కోట్లుగా అధికారులు చెబుతున్నారు.
ఎగుమతికి అద్భుత అవకాశం
ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కాకినాడ పోర్టుకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. గ్రీన్‌అమ్మోనియాను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ వెసులుబాటు అద్భుత అవకాశం కల్పిస్తుంది. ఏఎం గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిఫర్ ఎస్‌ఈతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ఓ పారిశ్రామిక పెట్టుబడి మాత్రమే కాదని, రాష్ట్ర ఇంధన భవిష్యత్తుకు స్పష్టమైన దిశానిర్దేశమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. దీని ద్వారా దేశంలోనే తొలిసారిగా జర్మనీ, సింగపూర్, జపాన్‌కు గ్రీన్ అమ్మోనియా ఎగుమతి జరగనుందని తెలిపారు.