Harish Rao: బీఆర్‌ఎస్ ప్రాజెక్టులకు కాంగ్రెస్ స్టిక్కర్లా?
ABN , Publish Date - Jan 17 , 2026 | 07:01 AM
ప్రాజెక్టులు కట్టడం బీఆర్‌ఎస్ వంతయితే, వాటికి తమ పేర్లు తగిలించుకొని క్రెడిట్ కొట్టేయడం కాంగ్రెస్ వంతయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
ఒక్క ఇటుక వేయని రేవంత్‌కు.. రిబ్బన్ కటింగ్‌లపైనే శ్రద్ధ..!
కేసీఆర్ వంట చేస్తే.. రేవంత్ గంటె పట్టుకొని ఫోజులు : హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టులు కట్టడం బీఆర్‌ఎస్ వంతయితే, వాటికి తమ పేర్లు తగిలించుకొని క్రెడిట్ కొట్టేయడం కాంగ్రెస్ వంతయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ తమ స్టిక్కర్లు వేసుకొంటోందని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. కేసీఆర్ కష్టపడి వంటచేస్తే.. రేవంత్ తానే అంతా చేసినట్లు గంటె పట్టుకొని ఫొటోలకు పోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాలనలో కనీసం చెప్పుకోవడానికి కూడా చేసిందేమీ లేదని, ప్రాజెక్టుల్లో ఒక్క ఇటుక కూడా వేయని రేవంత్, రిబ్బన్ కటింగ్‌పై మాత్రం శ్రద్ధ కనబరుస్తున్నారని విమర్శించారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు.. సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్‌కు కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, నియామక పత్రాలు రెడీమేడ్‌గా దొరికాయన్నారు. దీనిపై కాంగ్రెస్ డ్రామాలు ఆపాలని హెచ్చరించారు. చనాకా-కొరటా ప్రాజెక్టు కోసం కేసీఆర్ మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకొని దానిపై రూ.1200 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. చనాకా- కొరటా, సదర్మాట్ బ్యారేజీలు తామే పూర్తి చేశామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సదర్మాట్ బ్యారేజీని పూర్తిచేసినా, రెండేళ్లుగా నీళ్లు నిలపకుండా ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పుడు సిగ్గులేకుండా రిబ్బన్‌కట్ చేస్తూ అంతా తమ ఘనతే అని డబ్బా కొట్టుకోవడం కాంగ్రెస్ దగుల్భాజీతనానికి పరాకాష్ఠ అని విమర్శించారు. కేవలం ఎనుముల కుటుంబం అభివృద్ధి కోసమే.. ఈ రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. రెండేళ్లలో తెచ్చిన రెండున్నర లక్షల కోట్లు అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.