Share News

Kishan Reddy: మెట్రో రెండో దశకు మోక్షమెప్పుడో!

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:59 AM

హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు రెండో దశ డీపీఆర్‌పై నిరీక్షణ కొనసాగుతోంది. ఎల్‌అండ్‌టీ నుంచి మొదటిదశ ప్రాజె క్టును రాష్ట్రప్రభుత్వం...

Kishan Reddy: మెట్రో రెండో దశకు మోక్షమెప్పుడో!

  • కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఏళ్లుగా ఎదురుచూపు

  • మొదటి దశ టేకోవర్‌పై ఇంకా ఏర్పాటుకాని సంయుక్త కమిటీ

  • ఎల్‌అండ్‌టీ నుంచి టేకోవర్‌ పూర్తయితేనే రెండోదశలో కదలిక

  • స్పష్టంగా తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం

  • టేకోవర్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎంకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు రెండో దశ డీపీఆర్‌పై నిరీక్షణ కొనసాగుతోంది. ఎల్‌అండ్‌టీ నుంచి మొదటిదశ ప్రాజె క్టును రాష్ట్రప్రభుత్వం టేకోవర్‌ చేసుకునేందుకు ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో రెండోదశకు అనుమతి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని కేంద్రం కోరినా.. ఇప్పటివరకు పేర్లను ప్రతిపాదించలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. మెట్రో అంశంపై ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుకు అనుమతుల అంశంపై తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో మాట్లాడానని తెలిపారు. మొదటి దశ టేకోవర్‌ ప్రక్రియ పూర్తియిన తర్వాతే రెండో దశకు అనుమతులపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఖట్టర్‌ చెప్పినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. మెట్రో మొదటి దశను ఎల్‌అండ్‌ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌ చేసుకొనే ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలను త్వరగా పూర్తిచేయాలని కోరారు. రెండో దశకు ఇప్పట్లో మోక్షం కష్టమేనని కిషన్‌రెడ్డి లేఖతో తేటతెల్లమైంది. కాగా, ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకొనే ప్రక్రియను ఈ ఏడాది మార్చి నాటికి పూర్తిచేయాలని అధికారులను రాష్ట్రప్రభుత్వం ఆదే శించింది.


2024లోనే కేంద్రానికి ప్రతిపాదనలు

ఇతర రాష్ర్టాల్లోని నగరాల్లో మెట్రో విస్తరణపై సానుకూలంగా స్పందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్‌ మెట్రోపట్ల నిర్లక్ష్యం వహిస్తోందని రాష్ట్రప్రభుత్వ వర్గాలు విమర్శిస్తున్నాయి. నగరంలో మెట్రో రెండో దశలో పార్ట్‌-ఏ కింద ప్రతిపాదించిన 5 కారిడార్లలోని 76.4 కిలోమీటర్లకు రూ.24,269 కోట్లు, పార్ట్‌-బీ కింద ప్రతిపాదించిన 3 కారిడార్లలోని 86.1 కిలోమీటర్ల నిడివి నిర్మాణానికి రూ.19,579 కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మొత్తం ప్రాజెక్టును 50:50 నిష్పత్తిలో జాయింట్‌ వెంచర్‌గా చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పార్ట్‌-ఏకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రం అనుమతి కోసం 2024 నవంబరు 4న హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) అధికారులు ఢిల్లీకి పంపించారు. పార్ట్‌-బీకి సంబంధించిన డీపీఆర్‌ను 2025 జూలైలో పంపారు. వీటిపై ఇప్పటికీ కేంద్రం స్పందించలేదు. తాజాగా మొదటి దశ టేకోవర్‌ మెలిక పెట్టడంతో ఇప్పట్లో ఇది తేలే అవకాశం లేదని తెలుస్తోంది.

ఇతర రాష్ట్రాల్లో చకచకా..

ఇతర రాష్ట్రాల్లోని మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం చకచకా అనుమతులు ఇస్తోంది. మహారాష్ట్రలోని పుణెలో రెండో దశ మెట్రోలో భాగంగా 48.86 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను 2024 అక్టోబరులో కేంద్రానికి పంపగా, 2025 జూన్‌ 26న కేంద్ర మంత్రివర్గ భేటీలో 31.64 కిలో మీటర్ల మార్గానికి అనుమతించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ప్రతిపాదించిన ఫేజ్‌ 1-బీకి కూడా గత ఏడాది ఆగస్టు 12న కేంద్రం పచ్చజెండా ఊపింది. రూ.5,801 కోట్లతో 11.65 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఢిల్లీ మెట్రో 5వ దశ(ఏ)లోని మూడు కారిడార్లలో 16 కిలోమీటర్ల మార్గానికి గత ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్‌ను సమర్పించగా, అదే ఏడాది డిసెంబర్‌ 24న ఆమోదించింది. ఈ అన్ని ప్రాజెక్టులకంటే ముందే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ మెట్రో డీపీఆర్‌ను పంపినప్పటికీ.. ఆమోదం విషయంలో జాప్యం జరుగుతుండడంతో నగరవాసులు నిరాశ చెందుతున్నారు.

Updated Date - Jan 17 , 2026 | 06:59 AM