విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి నుంచి తిరుపతికి విమానాలు
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:42 AM
తిరుపతి నుంచి విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రికి గురువారం నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ‘ఫ్లై91’ విమాన సంస్థకు చెందిన తొలి విమాన సర్వీసును వర్చువల్‌గా ప్రారంభించారు.
ప్రారంభించిన రామ్మోహన్‌నాయుడు
తిరుపతి సిటీ/రేణిగుంట/గన్నవరం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి నుంచి విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రికి గురువారం నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ‘ఫ్లై91’ విమాన సంస్థకు చెందిన తొలి విమాన సర్వీసును వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుపతి నుంచి విజయవాడకు బయల్దేరిన విమానానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫైర్ విభాగం సంప్రదాయ వాటర్ కేనన్ సెల్యూట్ చేసింది.
అనంతరం అథారిటీ అధికారులు తొలి ప్రయాణికుడికి బోర్డింగ్ పాస్ అందజేసి ఇతర ప్రయాణికులతో కలసి కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఫ్లై91 ద్వారా తిరుపతి- హైదరాబాద్ సర్వీసు రోజువారీగా, తిరుపతి-విజయవాడ సర్వీసు మంగళ, గురు, శని, ఆదివారాల్లో, తిరుపతి-రాజమండ్రి సర్వీసు సోమ, బుధ, శుక్రవారాల్లో నడవనున్నాయని తెలిపారు. తిరుపతి నుంచి కువైత్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు నేరుగా విమాన కనెక్టివిటీకి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
గన్నవరంలో ఘన స్వాగతం
విజయవాడ నుంచి తిరుపతికి నేరుగా విమాన సర్వీసు ప్రారంభించడం శుభ పరిణామమని, రాజధాని అమరావతి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగమని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఫ్లై91 సర్వీసు ప్రారంభం సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో కేక్ కట్ చేసి, తొలి ప్రయాణికుడికి బోర్డింగ్ పాస్ అందజేశారు. తిరుపతి నుంచి వచ్చిన విమానానికి సంప్రదాయ వాటర్ కేనన్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఫ్లై 91 ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరుస సెలవులతో రైళ్లన్నీ కిటకిట
మరో ట్రావెల్స్ బస్సు దగ్ధం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News