బాలారం సర్పంచ్‌కు అరుదైన గౌరవం
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:10 AM
మండలంలోని బాలారం పంచాయతీ సర్పంచ్ అప్పన అప్పలనర్సకు అరుదైన గౌరవం దక్కింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో కలిసి వేదికపై ఆశీనురాలయ్యే అవకాశం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి విశేష సేవలందించిన 19 మంది కార్యకర్తలకు ఈ అవకాశం కల్పించగా, అందులో అప్పలనర్స కూడా ఉన్నారు.
- టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొనే అవకాశం
కొయ్యూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బాలారం పంచాయతీ సర్పంచ్ అప్పన అప్పలనర్సకు అరుదైన గౌరవం దక్కింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో కలిసి వేదికపై ఆశీనురాలయ్యే అవకాశం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి విశేష సేవలందించిన 19 మంది కార్యకర్తలకు ఈ అవకాశం కల్పించగా, అందులో అప్పలనర్స కూడా ఉన్నారు. ఈ మేరకు ఆమెకు పార్టీ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆదివారం జరగనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఏటా ఘనంగా నిర్వహించే టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి పార్టీకి విశేష సేవలందించిన 19 మంది కార్యకర్తలను అధినేతతో పాటు సభా వేదికపై కూర్చోబెట్టాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో 19 మందిని ఎంపిక చేశారు. ఇందులో బాలారం సర్పంచ్ అప్పలనర్సకు ఈ అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అప్పలనర్స పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు పార్టీ అండతో మూడు సార్లు బాలారం సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 2021లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ గాలి అధికంగా ఉన్నప్పటికీ అప్పలనర్స కుమారుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి అప్పన శ్రీరాములు భారీ మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం సంవత్సరం వ్యవధిలో కరోనా బారిన పడి మృతి చెందాడు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో అప్పలనర్స తిరిగి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అప్పలనర్స మాట్లాడుతూ పార్టీ అధినేత తనకు అరుదైన గౌరవం కల్పించారని, తన సేవలను గుర్తించిన చంద్రబాబునాయుడుకు రుణపడి ఉంటానని తెలిపారు.