సీఎం పర్యటన.. ఆ ప్రాంత ప్రజల్లో చిగురిస్తున్న కొత్త ఆశలు..!
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:29 AM
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో సీఎం చంద్రబాబు పర్యటనపై ఏమని చర్చలు సాగుతున్నాయి? ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయా? మెట్టప్రాంతం ఒకేసారిగా ఎలా అభివృద్ది చెందుతోంది? జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కాకర్ల గురించి ఉదయగిరి వాసులు ఏమంటున్నారు? ఆసక్తికర అంశాలతో ప్రత్యేక కథనం మీకోసం..
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో సీఎం చంద్రబాబు పర్యటనపై ఏమని చర్చలు సాగుతున్నాయి? ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయా? మెట్టప్రాంతం ఒకేసారిగా ఎలా అభివృద్ది చెందుతోంది? జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కాకర్ల గురించి ఉదయగిరి వాసులు ఏమంటున్నారు? ఆసక్తికర అంశాలతో ప్రత్యేక కథనం మీకోసం..
మెట్టప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా తాగు, సాగునీటి సమస్యలు ఉన్నాయి. సువిశాలమైన భూములు ఉన్నప్పటికీ నీరనేది లేక పంటలు పండవు. అయిదు, ఆరు వందల అడుగుల లోతున బోర్లు వేసినా నీళ్లు పడేవి కావు. వేసవిలో తాగునీటి కష్టాలు చెప్పేవికావు. రోడ్డు మార్గాలు ఉండవు. విసిరేసినట్టు అక్కడో ఊరు, అక్కడో ఊరు. ఊళ్లకి ఊళ్ల జనం పనుల కోసం వలసలు వెళుతుంటారు. ఆ క్రమంలో.. అభివృద్ది అనేది కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితం కాకూడదు... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇటీవల చంద్రబాబు వింజమూరులో పర్యటించారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ వింజమూరు దాహార్తి తీర్చాలని భావించారు. నేతలతో చర్చించారు. చెత్తచెదారాలతో ఓ వైపు డంపింగ్ యార్డుని.. మరో వైపు ముళ్లకంప చెట్లు, నల్లతుమ్మ చెట్లతో కళావిహీనంగా కనిపించే.. వింజమూరు చెరువుని శుభ్రం చేయించారు. ఐకమత్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేశారు. చెరువుని చూడచక్కగా తీర్చిదిద్దారు. రోడ్లు వెడల్పు చేశారు. పార్కు ఏర్పాటు చేసి, ఓ పర్యాటక ప్రాంతంగా మార్చారు.
చంద్రబాబు హెలికాఫ్టర్ దిగి, చెరువుని చూస్తూ ప్రజావేదిక వద్దకి వచ్చారు. గతంలో జన్మభూమి పేరుతో చెరువులని అభివృద్ధి చేసిన విషయాలని గుర్తు తెచ్చుకున్నారు. మీరు నీటికోసం ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు.. వింజమూరు చెరువుని అద్భుతంగా చేశారు. ఇప్పుడే హామీ ఇస్తున్నా.. రూ.35కోట్లు నిధులు కేటాయిస్తున్నా.. ఆరు నెలల్లో వింజమూరు చెరువు సోమశిల నీటితో నింపుతాం.. అంటూ హామీ ఇచ్చారు. అంతే.. చంద్రబాబు ఏమి హామీ ఇస్తారో? నీటి కష్టాలు తీరుస్తారో? లేదో?.. అనుకుంటూ మారుమూల కుగ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది మంది ఆనందానికి హద్దు లేదు. ఒక్కసారిగా ప్రజావేదిక కరతాళ ధ్వనులతో హోరెత్తింది. చంద్రబాబు ఓ గొప్ప పనిచేశాడని ఉదయగిరి వాసులు చర్చిస్తున్నారు. రాజోలు నుంచి వింజమూరుకి సోమశిల జలాలు వస్తే.. నడిమధ్యన మరో 15 గ్రామాలకి నీటి కష్టాలు తీరుతాయి. గోదావరి పుష్కరాలలోపు పోలవరం ప్రారంభిస్తామనే హామీ ఆనందాన్ని ఇస్తుంది. గోదావరి జలాలు కృష్ణానదికి తెచ్చి.. కృష్ణా జలాలని ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలకి తీసుకువెళ్లే మార్గం సుగమం అవుతుంది. ఉదయగిరి పల్లెలకీ నీటి కొరత తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చలు సాగుతున్నాయి.
ఉదయగిరికి ప్రస్తుతం కావలి - సీతారామపురం, ఏర్పేడు - నకిరికల్లు, అద్దంకి - పోరుమామిళ్ల, అద్దంకి - బెంగుళూరు హైస్పీడ్ హైవేలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే పారిశ్రామికవేత్తలు ఉదయగిరి వైపు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చాయి. వాటి స్థాపనకి భూ సేకరణ జరుగుతుంది. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కాకర్ల భూసేకరణ త్వరగా జరిగి, వీలైనంత త్వరగా పరిశ్రమలు ఏర్పాటు అయ్యేందుకు కృషి చేస్తున్నారు. అవి ఏర్పాటైతే, వాటికి అనుబంధంగా కొన్ని, ఇతర పరిశ్రమలు మరికొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే పనులూ పూర్తవుతున్నాయి.
చంద్రబాబు తన పర్యటనలో నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రూపులు పక్కన పెట్టాలని.. అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని.. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఐకమత్యంగా ఉంటేనే, ఉదయగిరిని అభివృద్ధి చేయగలరని సూచించారు.
ఉదయగిరిలో వైసీపీ కనుమరుగు అవుతుంది. గత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి శాంతమ్మ ఎన్నికలకి ముందే టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన గ్రామాల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. గత ఎన్నికల ప్రచారాల్లోనే చాలా గ్రామాల ప్రజలు మీరు ఏమి చేశారంటూ రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. ఉన్న కొద్ది మంది నేతలు, శ్రేణులు సైలెంట్ అయ్యారు.
కూటమి ప్రభుత్వం ఇదే స్ఫూర్తితో.. ఉదయగిరిపై దృష్టిసారిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే వీలుంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా.. నీటి కష్టాలు తీరుస్తుందని, పరిశ్రమలు తెస్తుందని, అభివృద్ధి చేస్తుందని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఇదే టెంపోని ఎంత వరకు కొనసాగిస్తారో.. చూడాలి..!