వైసీపీ నేతలు కోట్లు కొట్టేశారు
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:11 AM
రూపాయికి పది రూపాయల ఆదాయం వస్తుందని ఆశ చూపారు. కిరాణా కిట్ల పేరుతో సరుకులు ఇస్తామని నమ్మించారు.
‘స్కీమ్’ల పేరుతో డిపాజిట్ల సేకరణ
ఒక్క నెల్లూరు సమావేశంలోనే 2కోట్లకు పైగా వసూళ్లు
ఎన్నికలకు ముందు వెబ్‌సైట్ మూసివేత.. బెదిరింపులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు..8 మందిపై కేసునమోదు
నెల్లూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రూపాయికి పది రూపాయల ఆదాయం వస్తుందని ఆశ చూపారు. కిరాణా కిట్ల పేరుతో సరుకులు ఇస్తామని నమ్మించారు. పక్కా స్కెచ్‌తో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.కోట్లు పెట్టుబడి పేరుతో తీసుకున్నారు. డబ్బులన్నింటినీ పోగేసుకొని ఒక్కసారిగా ఉడాయించారు. ‘అరుణోదయ నెట్‌వర్క్ మార్కెటింగ్ లిమిటెడ్’, ‘భారత్ ఈ-స్టోర్ ఇండియా లిమిటెడ్’ పేర్లతో జరిగిన ఘరానా మనీస్కీం మోసం నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో తోటపల్లి గూడూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీపీ గూడూరు మండల వైసీపీ కన్వీనర్ ఉప్పాల శంకరయ్య గౌడ్‌తోపాటు మరో ఏడుగిరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తుల ద్వారానే రూ.2.13 కోట్లు సేకరించినట్లు తేలింది. వివరాలివీ.. తోటపల్లి గూడూరు మండలానికి చెందిన వైసీపీ నాయకుడు ఎండ్లూరి సుధాకర్(ఏ-1) 2023 డిసెంబరులో నెల్లూరులోని ఓ హోటల్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీపీ గూడూరుకు చెందిన దాసరి అనిత(ఏ-2), ఉప్పాల శంకరయ్య గౌడ్(ఏ-3), విజయవాడకు చెందిన గుత్తా గోపాలకృష్ణ(ఏ-4), గుత్తా కిరణ్(ఏ-5), గుంజాల లక్ష్మి(ఏ-6), గుంజాల గోపాల కృష్ణ(ఏ-7), గుంజాల రోహిణి(ఏ-8)లను అరుణోదయ నెట్‌వర్క్ మార్కెటింగ్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లుగా పరిచయం చేశారు.
వీరంతా కలిసి రెండు రకాల మార్కెటింగ్ పథకాలను వివరించారు. మొదటిది ‘కిరాణా కిట్’ స్కీమ్. ఇందులో ఒక వ్యక్తి రూ.7,000 డిపాజిట్ చేస్తే వారికి ఆ మొత్తానికి సరిపడా కిరాణా సరుకుల కిట్ అందజేస్తామని చెప్పారు. వంద రోజుల పాటు రోజుకు రూ.7 చొప్పున డిపాజిట్ దారుని ఖాతాలో జమవుతుందని నమ్మబలికారు. రెండవది ‘మనీ స్కీమ్’. ఇందులో రూ.లక్ష పెట్టుబడిగా పెడితే 300 రోజుల పాటు ప్రతి రోజూ రూ.వెయ్యి చెప్పున చెల్లిస్తామని ఆశ చూపారు. ఇలా 2024 మార్చి వరకూ అనేక మంది నుంచి లక్షల్లో డిపాజిట్లు సేకరించారు. ఎన్నికలకు ముందు వెబ్‌సైట్ మూసేసే వరకూ డబ్బులు చెల్లించిన వారి వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టేవారు.
తిరిగి చెల్లింపుల గురించి బాధిత పెట్టుబడిదారులు కొందరు టీపీ గూడూరులోని నిందితులు ఎండ్లూరి సుధాకర్, ఉప్పాల శంకరయ్యలను సంప్రదించారు. డబ్బులకు ఎటువంటి ఇబ్బంది లేదంటూ మొన్నటి వరకూ చెప్పినోళ్లు... తాజాగా తమ రాజకీయ పలుకుబడితో బెదిరించడం మొదలుపెట్టారు.
మోసపోయామని గ్రహించిన బాధితులు గత నెల 31న టీపీ గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామర్లకోటకు చెందిన పీసీ రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎనిమిది మందిపై పోలీసులు బీఎన్‌ఎ్‌స, టీబీయూడీఎస్, ఏపీపీడీఎ్‌ఫఈఏ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్