2028 టార్గెట్.. నెల్లూరును గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి నారాయణ
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:56 AM
నెల్లూరు అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పనులను వేగంగా పూర్తి చేసి.. 2028 నాటికి నెల్లూరును గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
నెల్లూరు, సెప్టెంబర్ 27: వచ్చే ఏడాది జూన్ 12లోపు నెల్లూరులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం చివరి దశలో పది శాతం పనులను పూర్తి చేయకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయని, ప్రస్తుతం మళ్లీ నిధులు సమీకరించి పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు సీఎం రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. అలాగే నవాబుపేటలో 21.3 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్లతో పీపీపీ విధానంలో కమర్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. తొలి దశలో రూ.13 కోట్లతో పనులు ప్రారంభించి, వ్యాపారులతో చర్చించి వారికి అనుకూలంగా నిర్మాణాలు చేపడతామని చెప్పారు.
తనపై వస్తున్న విమర్శలపైనా మంత్రి నారాయణ స్పందించారు. దేశంలోని 30 రాష్ట్రాల్లో నారాయణ సంస్థల్లో 60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. తాను సంపాదించాలనుకుంటే సంస్థల ద్వారా వేల కోట్లు సంపాదించుకోవచ్చని, అయితే తనకు తప్పులు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తనపై అవాకులు, చెవాకులు మాట్లాడితే విమర్శలు చేసేవారికే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. 2028 జూన్ 12 నాటికి నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ తెలిపారు.
ఇవీ చదవండి:
బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్ కూల్‌గా.!
పెన్సిల్ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!