చేసిన మేలు చెబుదాం!
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:43 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా విజయాలను వివరిస్తూ మూడు ప్రాంతాల్లో మూడు అంశాలపై బహిరంగ సభలు నిర్వహించాలని ఎన్డీయే నేతలు నిర్ణయించారు. హడావుడి....
రెండేళ్ల పాలనపై 3 ప్రాంతాల్లో బహిరంగ సభలు
ఎన్డీయే సమావేశంలో నిర్ణయం
9న తిరుపతి, 12న అమరావతి,15న విశాఖలో నిర్వహణ
ఆర్భాటం లేకుండా సాదాసీదాగా సభలు
24 నెలల విజయాలపై 24 కార్యక్రమాలు
కేంద్ర మంత్రులకూ భాగస్వామ్యం
అమరావతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా విజయాలను వివరిస్తూ మూడు ప్రాంతాల్లో మూడు అంశాలపై బహిరంగ సభలు నిర్వహించాలని ఎన్డీయే నేతలు నిర్ణయించారు. హడావుడి, ఆర్భాటాల్లేకుండా సాదాసీదాగా వీటిని జరుపుతారు. గురువారం చంద్రబాబు నివాసంలో సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్, ఆ పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాధవ్ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సంక్షేమంపై ఈ నెల 9న తిరుపతిలో, సుపరిపాలనపై 12న అమరావతిలో, అభివృద్ధిపై 15న విశాఖపట్నంలో భారీ సభలు నిర్వహించనున్నట్లు పల్లా ఆ తర్వాత తెలిపారు. మాధవ్, మనోహర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్డీయే నేతల భేటీలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేశారు. ‘13, 16, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లా స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి రెండేళ్ల విజయాలపై కార్యక్రమాలు చేపడతారు. 24 మాసాల్లో సాధించిన విజయాలపై 24 కార్యక్రమాలను 25 జిల్లాల్లోనూ నిర్వహిస్తాం. కేంద్ర మంత్రులు కూడా వీటిలో భాగస్వాములవుతారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై మూడు పార్టీల నడుమ సమన్వయం ఎలా ఉండాలన్న అంశంపై కూడా సమావేశంలో చర్చించాం’ అని పల్లా వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మనోహర్ చెప్పారు. మాధవ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేసిన జూన్ 9 నుంచి కూటమి విజయోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. హడావుడి, ఆర్భాటం లేకుండా సభలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాజ్యసభ సీట్లపై స్పందిస్తూ.. టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకి ఉన్నట్లేనని అన్నారు. బీజేపీ, టీడీపీ కలిసి ఉండటం కొందరికి కంటగింపుగా మారిందని.. కొందరు స్వయం ప్రకటిత మేధావులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారని, ఎవరేం చేసినా తాము కలిసే ఉంటామని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌పై తెలంగాణ నేతల వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా తెలంగాణ వారే కాదు.. ఎవరు వ్యాఖ్యలు చేసినా అది తప్పేనని స్పష్టం చేశారు.