ప్రకృతి సేద్యంతో సై!
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:46 AM
ప్రకృతి వైపరీత్యాలు తలెత్తిన ప్రతిసారీ... పంటలకు గండమే! ఇటీవల వరుసగా వచ్చిన అర్నబ్, మురసు దెబ్బకు రైతులు కుదేలయ్యారు. ఆసక్తికరమైన అంశమేమిటంటే...
తుఫాన్లను తట్టుకుని నిలబడిన పంటలు
బలంగా మొక్కలు, కాండం, కొమ్మలు
తక్కువ నష్టం... తగ్గని దిగుబడులు
అదే గాలులకు నేలకొరిగిన రసాయన ‘పంటలు’
క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన ఏపీసీఎన్ఎఫ్
60 లక్షల మందిని ప్రకృతి సాగువైపు మళ్లించే లక్ష్యం
రసాయనం x ప్రకృతి
తాజా తుఫాన్ల దెబ్బకు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో తుమ్మూరు సంజీవరెడ్డి అనే రైతు సాగు చేసిన ఎంటీయూ-1318 వరి పంట అధికశాతం నేల వాలింది. పక్కనే అదేరకం వరిని ప్రకృతి సేద్యం విధానంలో సాగు చేసిన గుజ్జుల నాగరాజు పొలంలో మాత్రం పంట నిటారుగా నిలబడింది.
గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకులపూడిలో ప్రకృతి వ్యవసాయ రైతులు అన్నదాసు నాగేశ్వరరావు, ఆరాధ్యుల ఛాయనాథవర్మ సాగు చేసిన వరి పంటలు నిలబడి ఉండగా.. పక్కనే రసాయన పద్ధతిలో సాగు చేసిన శివనాగేశ్వరరావు వరి పంట దాదాపు పూర్తిగా నేలమట్టమైంది.
కొల్లిపర మండలం హనుమాన్‌పాలెంలో ప్రకృతి వ్యవసాయ రైతు శ్యామ్‌బాబు అరటి తోటలో గాలులకు కేవలం 20 శాతం మొక్కలు నేలకొరిగాయి. పక్కనే రసాయన పద్ధతిలో సాగు చేసిన అర్వపల్లి పెద్దబ్బాయి తోటలో దాదాపు 80 శాతం మొక్కలు దెబ్బతిన్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాలు తలెత్తిన ప్రతిసారీ... పంటలకు గండమే! ఇటీవల వరుసగా వచ్చిన అర్నబ్, మురసు దెబ్బకు రైతులు కుదేలయ్యారు. ఆసక్తికరమైన అంశమేమిటంటే... ప్రకృతి వైపరీత్యాలు విసిరే సవాల్‌ను ప్రకృతి సేద్యం బలంగా ఎదుర్కొంటోంది.
రసాయన విధానంలో సాగుచేస్తున్న పంటలు ఇట్టే వాలిపోతుండగా... ప్రకృతి సేద్యం పంటలు పొలంలో ఠీవిగా నిలబడుతున్నాయి. కాండం, మొక్క, కొమ్మలు బలంగా ఉండటమే దీనికి కారణమని ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విధానం(ఏపీసీఎన్ఎఫ్) అధికారులు విశ్లేషించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు అధికంగా ఉన్న పలు ప్రాంతాల్లో రసాయన వ్యవసాయ పంటలు, 40 నుంచి 100శాతం దెబ్బతినగా, ప్రకృతి వ్యవసాయ పంటలకు 20శాతం లోపే నష్టం జరిగినట్లు గమనించారు.
అయితే ప్రస్తుతం పంట కోత ప్రయోగాలు సాగుతున్నందున దిగుబడి వ్యత్యాసాన్ని త్వరలో నమోదు చేయనున్నారు. గతంలో మొంథా, దిత్వా తుఫాన్ల సమయంలో ప్రకృతి సేద్య పద్ధతిలో దిగుబడి ఏమాత్రం తగ్గలేదని, రసాయన వ్యవసాయంలో దిగుబడిపై తుఫాన్లు తీవ్ర ప్రభావం చూపినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 60లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయ విధానం వైపునకు ఏపీసీఎన్ఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది.
అనేక జిల్లాల్లో అదే బలం..
ప్రస్తుత వరుస తుఫాన్ల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో ఏపీసీఎన్ఎఫ్ అధికారులు ఒకే ప్రాంతంలో, ఒకే వాతావరణ పరిస్థితుల్లో సాగయిన రసాయన సేద్యం, ప్రకృతి సేద్యం పంటలను పరిశీలించారు. ప్రకృతి సేద్య పంటలు ఏ మాత్రం నష్టపోకుండా నిలబడటాన్ని గుర్తించినట్లు తెలిపారు. ప్రకృతి సేద్యంలో సాగు చేసిన అరటి బలంగా నిలబడ్డాయి. ఈ విధానంలో తోటలో పిలకల సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉండటంతో పాటు దిగుబడి సామర్థ్యం కూడా మెరుగ్గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లూరులో ప్రకృతి సేద్య రైతు కుక్కల నాగరాజు సాగు చేసిన సంపత్ స్వర్ణ వరి పంటలో 70శాతం నిలబడగా, అదే రకం పక్కనే రసాయన పద్ధతిలో సాగు చేసిన చిన్న శ్రీను పొలంలో పంటంతా నేలకొరిగింది. పెంటపాడు మండలం బీ కొండేపాడులో సహజ వ్యవసాయ రైతులు పాలా సాయిపద్మ పొలంలో సుమారు 80శాతం వరి పంట నిలబడి ఉండగా, సమీపంలోని రసాయన పద్ధతిలో సాగైన పాలా దత్తుడు పొలంలో పంట పూర్తిగా నేలకొరిగింది.
ప్రకాశం జిల్లా ముండ్లుమూరు మండలం పురుమెట్టలో ప్రకృతి సేదయ రైతు నాగబ్రహ్మారెడ్డి సాగు చేసిన 555 రకం మిరప పంటలో ఒక్క మొక్క కూడా నేలకొరగలేదు. అదే గ్రామంలో రసాయన వ్యవసాయ రైతు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వేసిన తేజ రకం మిరప పంటలో 40శాతం మొక్కలు దెబ్బతిన్నాయి. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లిలో ప్రకృతి సేద్య రైతు నరేంద్రరెడ్డి సాగు చేసిన 5204 రకం వరి పంటల నిలబడి ఉండగా, అదే రకం సాగు చేసిన రసాయన వ్యవసాయ రైతు అంజిరెడ్డి పొలంలో 70 శాతం దాకా పంట నేలకొరగడాన్ని గుర్తించారు.
అధిక దిగుబడి... పరిమిత నష్టం!
కాకినాడ జిల్లా ఏలేశ్వరరం మండలంలో బీపీటీ 5204 రకం వరి పంట ప్రకృతి సేద్య రైతు బుగత అరుణ పొలంలో ఒక్కో మొక్క కు 61 పిలకలు, ఒక్కో వెన్నుకు 285 గింజలు నమోదయ్యాయి. అందులో 6 పిలకలు దెబ్బతిని, పంట నిలబడింది. కానీ అదే గ్రామంలో రసాయన సాగు రైతు బుగత రామానాయుడు పొలంలో మొక్కకు 46 పిలకలు, ఒక్కో వెన్నుకు 242 గింజలు మాత్రమే ఉండగా అలాగే 12 పిలకలు దెబ్బతినగా, 80శాతం పంట నేలవాలడాన్ని గుర్తించారు. పల్నాడు, అనకాపల్లి, బాపట్ల, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వరి సాగులో ప్రకృతి సేద్యంలో, రసాయన సాగులో కూడా ఇదే తీరులో వ్యత్యాసాన్ని గుర్తించినట్లు ఏపీసీఎన్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది ఎల్‌నినో నేపథ్యంలో వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్(పీఎండీఎస్) విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది. ప్రకృతి సేద్యవిధానంలో ఘన జీవామృతం, వృక్ష ఆధారిత కషాయాలు, సేంద్రియ కర్బన పదార్ధాలు, సూక్ష్మజీవుల చురుకుదనం, నేల ఆరోగ్యం, నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని రుజువైనట్లు ఏపీసీఎన్ఎఫ్ అధికారులు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంలో మొక్కలు, కాండం, కొమ్మలు, ఆకులు బలంగా ఉంటాయని, ఈ అధ్యయనాల ద్వారా గుర్తించినట్లు తెలిపారు. అందువల్ల రైతులు రసాయన వ్యవసాయ విధానాల నుంచి ప్రకృతి సేద్య విధానాల వైపు మరలాలని ఏపీసీఎన్ఎఫ్ అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి: