సొంత కూతురిలా చూసుకుంటా
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:17 AM
అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను సొంత కూతురిలా భావించి అండగా ఉంటానని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.
రాప్తాడులో ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని కుటుంబానికి లోకేశ్ భరోసా
ప్రస్తుతం నిలకడగా బాలిక ఆరోగ్య పరిస్థితి
మరో 48 గంటలు చాలా కీలకం
బాలిక సురక్షితంగా ఇంటికి రావాలని ప్రార్థిద్దాం
దాడులు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు
నిందితుడిపై న్యాయబద్ధంగా కఠిన చర్యలు
బెంగళూరు ఆస్పత్రిలో బాలికకు పరామర్శ
చికిత్సపై వైద్యులతో చర్చించిన మంత్రి
అమరావతి, బెంగళూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను సొంత కూతురిలా భావించి అండగా ఉంటానని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు. ఆదివారం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాలిక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేశ్ మాట్లాడారు. విద్యార్థినిపై జరిగిన దాడి దుర్మార్గమన్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికారులతో చర్చించానని చెప్పారు. బాలికకు అనంతపురంలో చికిత్స చేసిన అనంతరం గ్రీన్ చానల్ ఏర్పాటుచేసి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించామని అన్నారు. వైద్యులు సుమారు 12 గంటలపాటు శ్రమించి బాలికకు అనేక శస్త్రచికిత్సలు చేశారని, అనంతరం ఐసీయూకి తరలించారని లోకేశ్ తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వచ్చే 48 గంటలు చాలా కీలకమని లోకేశ్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ బాలిక ఆరోగ్యం గురించి ప్రార్థించాలని కోరారు. ‘బాలిక చాలా స్ర్టాంగ్‌గా ఉంది. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుంది. విద్యార్థిని సంపూర్ణంగా కోలుకునేవరకు అన్ని విధాలా అండగా ఉంటుంది. జరిగిన ఘటనతో పాఠశాలలో విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అందిస్తున్నాం. ఇది ఒక్కరోజులో జరిగేది కాదు. వచ్చే ఏడాది పాటు మానిటరింగ్ చేస్తాం’ అని తెలిపారు.

విద్యార్థుల రక్షణే మొదటి ప్రాధాన్యం
‘పాఠశాలలో మొదటి పీరియడ్ ప్రారంభమైన వెంటనే గేట్లు మూసివేస్తాం. సదరు పాఠశాలలో భవిత సెంటర్ నిర్మాణం జరుగుతుండటంతో కార్మికుడి ముసుగులో వచ్చి యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. దాడి ఘటనను చాలా సీరియ్‌సగా తీసుకుంటున్నాం. ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపడతాం. విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం. పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటుచేస్తాం. దాడికి పాల్పడిన వ్యక్తిపై న్యాయబద్ధంగా కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. మహిళలపై దాడులకు పాల్పడే వారికి అదే చివరి రోజు అవుతుందని గతంలోనే హెచ్చరించాం. అలాంటి కఠినమైన, న్యాయబద్ధమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరినీ ఉపేక్షించేది లేదు. బాలిక కుటుంబ సభ్యులను కూడా కలిశాను. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చాను. ఏ అవసరం వచ్చినా సంప్రదించాలని చెప్పాను. ప్రభుత్వపరంగానే కాకుండా, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను, స్థానిక శాసనసభ్యురాలిగా పరిటాల సునీత అండగా ఉంటామని ధైర్యం చెప్పాను. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వచ్చే 48 గంటలు మేం నిరంతరం పర్యవేక్షిస్తాం. ఇక్కడి వైద్యులు అద్భుతంగా స్పందించారు. వైద్యులతోపాటు పోలీసులను కూడా అభినందిస్తున్నాను. గ్రీన్ చానల్ ఇవ్వాలని కోరిన వెంటనే కర్ణాటక పోలీసులు తక్షణమే స్పందించి తగిన ఏర్పాట్లు చేశారు. బాలికను సురక్షితంగా తరలించారు. ఇలాంటి ట్రామా కేసును ఇక్కడి వైద్యులు ఎప్పుడూ చూడలేదు. 12 గంటల పాటు నిరంతరం శ్రమించారు’ అని లోకేశ్ వివరించారు.
వైద్యులకు ధన్యవాదాలు
మణిపాల్ ఆసుపత్రిలో మంత్రి లోకేశ్‌కు వైద్యులు బాలిక పరిస్థితిని వివరించారు. విద్యార్థినికి అవసరమైన శస్త్రచికిత్సలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేశామని, బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాలిక ప్రాణాలు కాపాడేందుకు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు చేస్తున్న కృషికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు వెళ్లి బాలికను చూశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, పాఠశాల విద్య శాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..
నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం