Share News

రాష్ట్రానికి మరో మణిహారం

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:55 AM

: రాష్ట్రానికి మరో మణిహారం రానుంది. రాయలసీమలో ఏర్పాటవుతున్న రక్షణ రంగానికి సంబంధించిన ఓ భారీ ప్రాజెక్టు త్వరలోనే అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీల్లో ఒకటైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ..

రాష్ట్రానికి మరో మణిహారం

  • రాయలసీమలో డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌

  • రూ.2,500 కోట్లతో శ్రీసత్యసాయి జిల్లాకు బెల్‌

  • 914 ఎకరాల్లో ఏర్పాటు.. 800 మందికి ఉద్యోగాలు

  • రెండు దశల్లో నిర్మాణం.. 2029 నాటికి ఉత్పత్తి

  • పనుల పురోగతిపై మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు

అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో మణిహారం రానుంది. రాయలసీమలో ఏర్పాటవుతున్న రక్షణ రంగానికి సంబంధించిన ఓ భారీ ప్రాజెక్టు త్వరలోనే అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీల్లో ఒకటైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) శ్రీసత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, పాలసముద్రం వద్ద రూ.2,500 కోట్ల పెట్టుబడితో భారీ రక్షణ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనికోసం శ్రీసత్యసాయి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ‘బెల్‌’కు 914 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ బెల్‌ డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (డీఎంసీ)ను ఏర్పా టు చేస్తోంది.

ఈ క్లస్టర్‌లో 800 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అటకెక్కింది. కూటమి సర్కారు రాకతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం (2024-29)లో భాగంగా ఈ ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం కింద ఈ నవరత్న కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోంది. ప్రాజెక్టు క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కింద 45 శాతం మేర పెట్టుబడి రాయితీని 15 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.

రాయలసీమలో డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, డ్రోన్‌ తయారీ సంస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా బెల్‌ ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి, రెండో దశ నిర్మాణ పనులను 2029 నాటికి పూర్తిచేసి, రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ డిఫెన్స్‌ క్లస్టర్‌లో క్షిపణి వ్యవస్థలతోపాటు అత్యాధునిక రక్షణ పరికరాలు తయారు చేస్తారని అధికారులు పేర్కొన్నారు.


దేశ సేవలో భాగస్వామ్యం: మంత్రి లోకేశ్‌

కేంద్ర నవరత్న కంపెనీల్లో ఒకటైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) రాష్ట్రానికి వస్తోందని, త్వరలోనే రక్షణరంగ పరికరాలను తయారు చేసేందుకు సిద్ధమవుతోందని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. ‘బెల్‌’ రూ.2,500 కోట్లతో రాయలసీమలోని శ్రీసత్యసాయి జిల్లాలో రక్షణ రంగ పరికరాల తయారీ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తోందని ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ఈ క్లస్టర్‌ ద్వారా మన యువతలో 800 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని సంతోషం వ్యక్తం చేశారు.

చెప్పినట్టుగానే చేసి చూపించాం అని పేర్కొంటూ బెల్‌ ఏర్పాటు చేస్తున్న డిఫెన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ పనులకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. దేశ రక్షణ రంగంలో వినియోగించే అత్యాధునిక యుద్ధ పరికరాల తయారీ కేంద్రాన్ని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా దేశ సేవలో రాష్ట్రం భాగస్వామ్యం కానుందని లోకేశ్‌ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 04:55 AM