Share News

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు-కంటైనర్ ఢీకొని ముగ్గురి మృతి

ABN , Publish Date - Jan 22 , 2026 | 06:39 AM

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను దాటి వెళ్లి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు డ్రైవర్ భాస్కర్ సహా మరో ఇద్దరు మృతిచెందారు.

ఘోర రోడ్డు ప్రమాదం..  ట్రావెల్స్ బస్సు-కంటైనర్ ఢీకొని ముగ్గురి మృతి
Nandyala road accident

ఆంధ్రజ్యోతి, జనవరి 22: నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట దగ్గర కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్(ARBCVR) బస్సు, కంటైనర్ లారీ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. బస్సు టైర్ ఒక్కసారిగా పేలి పోవడంతో డివైడర్‌ను దాటి వెళ్లిపోయి.. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్ దుర్మరణం చెందగా, కంటైనర్ లారీలోని డ్రైవర్, క్లీనర్‌లు క్యాబిన్‌లో చిక్కుకుపోయి సజీవ దహనం అయ్యారు. వీరి మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారిపోయాయి.


బస్సులోని ద్విచక్రవాహనాలు కూడా మంటల్లో కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కొందరు క్షతగాత్రులకు నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటానికి స్థానికులు, వాహనదారులు, బస్సు క్లీనర్ సహాయం చేశారు.

ప్రమాద సమాచారం తెలియగానే నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ కుమార్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. శిరివెళ్ల మండల పరిధిలో జరిగిన ఈ ఘటన జిల్లాలో భయాందోళన కలిగించింది. పోలీసులు కంటైనర్ డ్రైవర్, క్లీనర్ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.


కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు.. ప్రయాణికుల హాహాకారాలు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురై హాహాకారాలు చేశారు. నరసాపురం నుంచి హైదరాబాద్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో ఈ ప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెషర్ బెల్ట్ నుంచి పొగ వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

భీమవరం పరిధిలో ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంత రవాణా శాఖ అధికారులు వెంటనే బస్సును నిలిపివేశారు. ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారని, ఎవరికీ పెద్దగా గాయాలు లేవని తెలుస్తోంది. అయితే ఈ ఘటన ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. బస్సు ఏసీ సిస్టమ్‌లో లోపం కారణంగా పొగ వచ్చి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సును తనిఖీ చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2026 | 07:49 AM