పులివెందుల: నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:20 PM
పులివెందుల నియోజకవర్గంలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదం, జనసేన కార్యకర్త ముంతల రామాంజులు మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.
అమరావతి, నవంబరు 22: పులివెందుల నియోజకవర్గంలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన కార్యకర్త ముంతల రామాంజులు గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగాలని, మృతుడు రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విచారణ ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించే బాధ్యతను మంత్రి నాదెండ్ల మనోహర్‌కు అప్పగించిన పవన్ కల్యాణ్.. క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న పరిస్థితులపై సమగ్రంగా ఆరా తీసి, విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. మరోవైపు రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫున భరోసా కల్పించేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్‌ను పులివెందులకు పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ.. రామాంజులు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు!
22 నుంచి ఎస్ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్ టికెట్లు
Read Latest AP News And Telangana News