రైళ్లకు తీవ్ర అంతరాయం
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:11 AM
మురసు తుఫాను ప్రభావంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా గూడూరులో పలు రైళ్ల రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది.
గంటల తరబడి నిలిచిన 20కి పైగా రైళ్లు
తెలంగాణలో 5 గంటలు నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్
వేజెండ్లలో 6 గంటలు ఆగిన డబుల్ డెక్కర్
ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు
కేసముద్రం, చేబ్రోలు, నెల్లూరు/గూడూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మురసు తుఫాను ప్రభావంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా గూడూరులో పలు రైళ్ల రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి గూడూరు మీదుగా చెన్నై, తిరుపతి మార్గాలకు, అటునుంచి విజయవాడకు వెళ్లే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. సుమారు 20కి పైగా రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్తున్న 22707 నంబరు గల డబుల్ డెక్కర్ రైలును గుంటూరు జిల్లా వేజండ్ల రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో స్టేషన్‌కు చేరుకున్న రైలు మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే నిలిచిపోయింది.
తెలంగాణలో..
మురసు తుఫాను కారణంగా మంగళవారం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్‌లో ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.25 గంటలకు రైలు రావాల్సి ఉండగా, గంట ఆలస్యంగా 10.20 గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్‌కు చేరింది. రెండుగంటల అనంతరం కదిలి మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరింది. అక్కడ మూడు గంటల పాటు నిలిచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బయలు దేరింది. రైలు ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఇదిలా ఉండగా తిరుపతి నుంచి అదిలాబాద్‌కు వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4.15 గంటలకు కేసముద్రానికి రావాల్సి ఉండగా, 8 గంటలకుపైగా ఆలస్యమవుతుందని రైల్వే యాప్‌లలో చూపింది. ఆ తర్వాత ఈ రైలును తుఫాను కారణంగా ఏపీలోని రేణిగుంట జంక్షన్, చర్లపల్లి మీదుగా దారి మళ్లించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి రైలు ఒంగోలులో రాత్రి 2 గంటలకు రైట్‌టైం ఉండగా 16 గంటల ఆలస్యంతో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అక్కడికి చేరింది.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం