Share News

ఏపీని ఎంపిక చేసుకోండి

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:06 AM

క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు, డేటా సెంటర్లలో పెట్టుబడులకు ఏపీ ఎంతో సానుకూలమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని ఆహ్వానించారు.

ఏపీని ఎంపిక చేసుకోండి

  • క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయండి

  • విశాఖ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టండి

  • టోరెంట్‌ గ్రూప్‌, ఎస్‌టీ టెలీమీడియా అధినేతలతో మంత్రి లోకేశ్‌

  • కాకినాడలో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు వెల్‌స్పన్‌ గ్రూప్‌నకు ఆహ్వానం

  • మంత్రి ప్రతిపాదనలకు సానుకూల స్పందన

  • నెల్లూరులో పామాయిల్‌, సోయాబీన్‌ రిఫైనరీల ఏర్పాటుకు గోకుల్‌ గ్రూప్‌ ఆసక్తి

  • విశాఖలో గ్రీన్‌ ఫీల్డ్‌ టైర్ల తయారీ ప్రాజెక్టుపై చిరిపాల్‌ గ్రూప్‌ సానుకూలత

  • అహ్మదాబాద్‌లో పారిశ్రామికవేత్తలతో లోకేశ్‌ భేటీ

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు, డేటా సెంటర్లలో పెట్టుబడులకు ఏపీ ఎంతో సానుకూలమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని ఆహ్వానించారు. ఫార్మాస్యూటికల్స్‌, విద్యుత్‌, గ్యాస్‌, ఎలక్ట్రికల్‌ రంగాల్లో పేరెన్నికగన్న టోరెంట్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ మెహతా, డైరెక్టర్‌ షాన్‌ మెహతాతో లోకేశ్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఫార్మాక్లస్టర్లలో యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రేడియంట్స్‌ (ఏపీఐ) తయారీ, ఇంటర్మీడియట్‌ సామర్థ్యాలను విస్తరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఏపీలో సౌర, పవన, హైబ్రిడ్‌ పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలన్నారు. ఎనర్జీ స్టోరేజీ, గ్రీన్‌ మాలిక్యూల్స్‌లోకి టోరెంట్‌ పవర్‌ ప్రకటించిన విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా పంప్డ్‌ స్టోరేజీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ సంబంధిత క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ఏపీని ఎంపిక చేసుకోవాలని సూచించారు. లోకేశ్‌ ఆహ్వానంపై సమీర్‌ మెహతా సానుకూలంగా స్పందించారు.


  • పైప్స్‌, స్టీల్‌, హోమ్‌ టెక్స్‌టైల్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ రంగాల్లో పేరొందిన వెల్‌స్పన్‌ వరల్డ్‌ గ్రూప్‌ సీఈవో నితిన్‌ జైన్‌తో లోకేశ్‌ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో వెల్స్‌పన్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే కాకినాడలో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని నితిన్‌జైన్‌ తెలిపారు.

  • ఎడిబుల్‌ ఆయిల్స్‌, ఒలియో కెమికల్స్‌, బయో డీజిల్‌లో ప్రఖ్యాతిగాంచిన గోకుల్‌ ఆగ్రో రిసోర్సెస్‌ సీఎండీ కనుభాయ్‌ ఠక్కర్‌తో లోకేశ్‌ సమావేశమయ్యారు. కంపెనీ ప్రస్తుతం నెల్లూరులోని ప్లాంట్‌ విస్తరణగా పామాయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరగా, ఆయన సానుకూలత వ్యక్తం చేశారు.

  • టెక్స్‌టైల్స్‌, ప్యాకేజింగ్‌ ఫిల్మ్స్‌, సోలార్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, కెమికల్స్‌ రంగాల్లో పేరొందిన చిరిపాల్‌ గ్రూప్‌ ఎండీ బ్రిజ్‌మోహన్‌, సీఈవో వినయ్‌ థదానిని కలసి... విశాఖలో గ్రీన్‌ ఫీల్డ్‌ టైర్ల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

  • డేటా సెంటర్లు, కమ్యూనికేషన్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ టెక్నాలజీలో పేరున్న ఎస్‌టీ టెలీమీడియా సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ గౌతమ్‌ జెనా, సీవోవో లలిత్‌ కన్నాతో లోకేశ్‌ సమావేశమయ్యారు. డేటా సెంటర్‌ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని గౌతమ్‌ జెనా తెలిపారు.

  • బులియన్‌ ట్రేడింగ్‌, ప్రెషియస్‌ మెటల్స్‌ తయారీలో పేరున్న ఈ ప్యాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ భజరంగ్‌ బోత్రాను కలసి.. విశాఖపట్నంలో డేటా సెంటర్ల కోసం ప్రీ ఫ్యాబ్‌ నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

  • కాకినాడ లేదా అనకాపల్లిలో పైపుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆస్ట్రల్‌ పైప్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆల్కేష్‌ పంచల్‌ను లోకేశ్‌ కోరారు.

  • ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ గోండాలియాతో జరిగిన భేటీలో.. నక్కపల్లి క్లస్టర్‌లో బయోసిమిలర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సిందిగా లోకేశ్‌ ఆహ్వానించారు.

  • సోలార్‌ కాంపొనెంట్స్‌ తయారీలో పేరొందిన విశాఖ గ్రూప్‌ ఎండీ జిగీష్‌ భాష్‌ దోషితో లోకేశ్‌ సమావేశమయ్యారు. ఏపీలో సోలార్‌ మాడ్యూల్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లెక్సిబుల్‌ ప్యాకేజింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.


  • ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టండి

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మా ప్రత్యేకత

అహ్మదాబాద్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో లోకేశ్‌

క్లస్టర్‌ మోడల్‌లో ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నామని, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తమ ప్రత్యేకత అని మంత్రి లోకేశ్‌ అన్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ‘సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ 2026- ఏపీ ఈడీబీ’ ఆధ్వర్యంలో ఫార్మారంగంపై అహ్మదాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న బల్క్‌ డ్రగ్‌ పార్కు గురించి వివరించారు. ఫార్మా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. భారత ఫార్మారంగ అభివృద్ధికి ఏపీ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని లోకేశ్‌ అన్నారు.

దేశంలో ఏపీ 3వ అతిపెద్ద ఔషధ ఎగుమతిదారుగా ఉందన్నారు. దేశంలోని టాప్‌-5 ఫార్మా రాష్ట్రాల్లో ఏపీ ఒకటని పేర్కొన్నారు. అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం ప్రాంతాల్లో నాలుగు ఫార్మాస్యూటికల్‌ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నక్కపల్లి వద్ద 2 వేల ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్కు మొదటి దశ పూర్తయిందని అన్నారు. సమావేశంలో సాగా లైఫ్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌, ఇండియన్‌ డ్రగ్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ విరంచి షా, జైడస్‌ గ్రూప్‌ సీనియర్‌ లీడర్‌ డాక్టర్‌ గణేశ్‌ నాయక్‌, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ మోదీ పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 04:06 AM