Share News

కొరియాలో ఆరో రోజు మంత్రి నారా లోకేశ్ పర్యటన.. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం

ABN , Publish Date - Jul 10 , 2026 | 08:27 AM

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆరో రోజు ప్రముఖ సంస్థ కుకూ ఎలక్ట్రానిక్స్ హెచ్ఓడి చోహన్ చుల్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు.

కొరియాలో ఆరో రోజు మంత్రి నారా లోకేశ్ పర్యటన.. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
Nara Lokesh South Korea Tour

అమరావతి, జులై 10: దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆరో రోజు ప్రముఖ సంస్థ కుకూ ఎలక్ట్రానిక్స్ హెచ్ఓడీ చోహన్ చుల్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో గృహోపకరణాల యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో గృహోపకరణాల క్లస్టర్ ఉందని, అనేక ప్రముఖ సంస్థలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. భారతదేశంలో తయారవుతున్న ఏసీలలో 40 శాతం, టీవీలలో 35 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని లోకేశ్ స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రాష్ట్రంలో పుష్కలంగా అందుబాటులో ఉందని, ఇక్కడి నుంచి ఆగ్నేయ, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతులు చేయడం చాలా సులభమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, దక్షిణ భారతదేశంలో ఏసీల వినియోగం చాలా ఎక్కువగా ఉందని వివరించగా, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని కుకూ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు.


ఇదే పర్యటనలో భాగంగా ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ సీఈవోతో కూడా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శ్రీసిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈవీ విడిభాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ యూనిట్లను ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించాలని కోరారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు శ్రీసిటీలో సిద్ధంగా ఉన్నాయని మంత్రి వారికి వివరించారు. వీటితో పాటు రక్షణరంగ తయారీ యూనిట్లలో కూడా పెట్టుబడులు పెట్టాలని, కొరియన్ కంపెనీల సహకారంతో మోటివ్ లింక్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.


ఇవి కూడా చదవండి..

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎయిమ్స్‌

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Updated Date - Jul 10 , 2026 | 08:58 AM