Share News

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎయిమ్స్‌

ABN , Publish Date - Jul 10 , 2026 | 06:35 AM

బీబీ నగర్‌ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో దక్షిణాదిలోనే అత్యాధునిక, మెరుగైన వైద్య సేవలకు కేంద్రంగా..

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎయిమ్స్‌

  • బీబీ నగర్‌లో 87శాతం నిర్మాణాలు పూర్తి.. ఈ ఏడాది చివరికి పూర్తిస్థాయి వైద్య సేవలు

  • విద్య, పరిశోధనలకు కూడా సమ ప్రాధాన్యం

  • రోగుల సంఖ్య పెరిగినా సేవల్లో రాజీ పడబోం: నడ్డా

యాదాద్రి/హైదరాబాద్‌, జూలై 9(ఆం ధ్రజ్యోతి): బీబీ నగర్‌ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో దక్షిణాదిలోనే అత్యాధునిక, మెరుగైన వైద్య సేవలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎయిమ్స్‌ని సందర్శించారు. వివిధ వైద్య విభాగాలను పరిశీలించారు. పాలక మండలితో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీబీనగర్‌ ఎయిమ్స్‌ నిర్మాణ పనులు 87 శాతం పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరికల్లా పూర్తిస్థాయిలో వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఆస్పత్రికి రోగుల సంఖ్య ఎంత పెరిగినా వైద్యుల సంఖ్య పెంచడంలో, వైద్య సేవల్లో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఇక్కడ వైద్య సేవలు, ఆధునిక వైద్య విద్య, పరిశోధనలకు సమప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం బీబీనగర్‌ ఎయిమ్స్‌లో రోజుకు 1,800 మంది అవుట్‌ పేషెంట్లకు సేవలు అందుతున్నాయని తెలిపారు. టెలీ మెడిసిన్‌, ఓపీడీ ద్వారా ఇప్పటి వరకు 1,56,000 మంది రోగులు వైద్య సేవలు పొందారన్నారు. 132 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 133 మంది సీనియర్‌ వైద్యులు పనిచేస్తున్నారని చెప్పారు. వైద్య పరిశోధనల కోసం రూ.64 కోట్ల గ్రాంట్లు మంజూరయ్యాయని, 129 రీసెర్చ్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఫ్యాకల్టీ సభ్యులు 156 పరిశోధన పత్రాలు సమర్పించారన్నారు. 2014 కంటే ముందు దేశంలో ఎయిమ్స్‌లు ఏడు మాత్రమే ఉండేవని, నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత 23కు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ అమిత అగర్వాల్‌ పాల్గొన్నారు.


పన్నుల వాటాగా2.74 లక్షల కోట్లు!

పన్నుల్లో 42 శాతం వాటాకు అనుగుణంగా ప్రకారం తెలంగాణకు కేంద్రం నిధులు విడుదల చేస్తోందని కేంద్ర మంత్రి నడ్డా స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటున్న సీఎం రేవంత్‌ లెక్కల్లో వీక్‌ అని విమర్శించారు. పన్నుల్లో వాటా కింద తెలంగాణకు కేంద్రం రూ.2.74 లక్షల కోట్లు విడుదల చేసిందని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ప్రజాస్వామ్యం- దౌత్యం-అభివృద్థి’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుని, ఢిల్లీ పార్టీకి కప్పం కడుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు కనీసం గుడిసెలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకుందని ఆరోపించారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ ద్వారా 62కోట్ల మందికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా లభిస్తోందన్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందించే ‘వయో వందన యోజన’ను కూడా తెచ్చామని చెప్పారు.


మరోసారి బస్సు మిస్‌ చేసుకోవద్దు!

వేర్లు లేని చెట్టులా ఉండొద్దు.. బీజేపీ రాష్ట్ర నేతలకు కేంద్ర మంత్రి నడ్డా సూచన

‘గత ఎన్నికల్లో ఒక బస్సు మిస్‌ చేసుకున్నాం.. మరోసారి అలాంటి పరిస్థితి కల్పించుకోవద్దు..’ అని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నాయకులకు సూచించారు. పెద్దగా పట్టులేని బెంగాల్‌లోనే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో అధికారం పెద్ద సమస్య కాదని, కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా కృషి చేయాలన్నారు. ‘వేర్లులేని చెట్టులా ఉండొద్దు.. చెట్టుకు వేర్లు లేకపోతే త్వరగా పడిపోతుంది.. ఆ పరిస్థితి ఉండొద్దు.. నాయకులు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నప్పుడే పార్టీ బలోపేతమవుతుంది. నా నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు జరిగినా ఓటు వేసి వస్తా. మనం ఏ స్థాయిలో ఉన్నా మన పోలింగ్‌ బూత్‌ను మరచిపోవద్ద’ని సూచించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల పట్ల వ్యతిరేకతే బీజేపీకి అనుకూలిస్తుందని భావించవద్దని చెప్పారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని చెప్పారు.

Updated Date - Jul 10 , 2026 | 06:36 AM