Share News

టెట్‌, డీఎస్సీ.. ఏంటో జగన్‌కు తెలీదు

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:28 AM

మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల నియామకాలపై గొడ్డలి పార్టీ చేస్తున్న అసత్య ప్రచారానికి అధైర్య పడొద్దని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

టెట్‌, డీఎస్సీ.. ఏంటో జగన్‌కు తెలీదు

  • మీరు అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

  • అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు

  • స్పోర్ట్స్‌ కోటా టీచర్లకు మండిపల్లి హామీ

విజయవాడ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల నియామకాలపై గొడ్డలి పార్టీ చేస్తున్న అసత్య ప్రచారానికి అధైర్య పడొద్దని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన స్పోర్ట్స్‌ కోటా టీచర్లను మంత్రి కలిశారు. వైసీపీ ఫేక్‌ ప్రచారంతో ఇబ్బందులు పడుతున్న టీచర్ల బాధలను విన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జగన్‌ 2009లో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని బెదిరించి ఎంపీ సీటుకు పోటీ చేశారని, అప్పటికే మీలో చాలా మంది క్రీడాకారులుగా రాణించి జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారని అన్నారు. టెట్‌, ఏపీపీఎస్సీ, డీఎస్సీ, స్పోర్ట్స్‌ కోటా అనే వాటిపై జగన్‌కు ఏ మాత్రం అవగాహన లేదని విమర్శించారు. అలాంటి వ్యక్తి మాట్లాడినంత మాత్రాన మీరు సాధించిన ఘనత ఫేక్‌ కాదని అభ్యర్థులకు ధైర్యం చెప్పారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు బాత్‌రూంలో కాలు జారిపడినా..


దానికి వైసీపీ నేతలే బాధ్యత వహించాల్సిన రోజు వస్తుందన్నారు. టీచర్లపై విషం వెళ్లగక్కే సంస్కృతి వైసీపీ నేతల్లో నరనరాల్లో జీర్ణించుకుపోయిందన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విజయవాడలో టీచర్లను చాలా ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. జగన్‌ పుట్టక ముందే క్రీడా సంఘాలు, సమాఖ్యలు పుట్టాయన్నారు. క్రీడాకారులకు కనీస గౌరవం లేకుండా జగన్‌ మాట్లాడటం అతని నైజానికి నిదర్శనమన్నారు. డీఎస్సీ నియామకాలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. శాప్‌ కార్యాలయం బయట గొడవ చేసిన వైసీపీ వాళ్లలో గంజాయి బ్యాచ్‌ ఉన్నారని ఆరోపించారు. గతంలో రాజకీయ పార్టీలు నిరుద్యోగులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని ఆందోళనలు చేసేవని, వైసీపీ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చిన వారిని తీసేయాలని గొడవ చేస్తోందని విమర్శించారు. ఇది జగన్‌ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 04:28 AM