మార్కాపురం ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ యజమాని అరెస్ట్
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:31 PM
మార్కాపురం మండలం రాయవరం సమీపంలో నిన్న జరిగిన భీకర రోడ్డు ప్రమాదానికి కారణమైన హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
మార్కాపురం, మార్చి 27: రాయవరం సమీపంలో నిన్న జరిగిన భీకర రోడ్డు ప్రమాదానికి కారణమైన హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న అతడిని, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్నారు. బస్సు ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మరో 28 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
హరికృష్ణా రెడ్డి.. నెల్లూరు జిల్లా కలిగిరి కేంద్రంగా హరికృష్ణ ట్రావెల్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు గురువారం ఘోర ప్రమాదానికి గురి కావడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బస్సు యజమాని ఆచూకీ కనిపెట్టారు. ప్రస్తుతం.. హరికృష్ణా రెడ్డిని విచారిస్తున్నామని, నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
డీఎన్ఏ (DNA) పరీక్షల ద్వారా గుర్తింపు..
ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 14 మందికి మార్కాపురం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తైంది. అయితే.. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో, శాస్త్రీయ పద్ధతిలో గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మృతులు ఎవరనేది కచ్చితంగా తేల్చేందుకు గురువారం బాధిత కుటుంబసభ్యుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. ఈ నమూనాలను తదుపరి పరీక్షల కోసం ఉన్నతాధికారులు విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఆ నివేదికల అనంతరం మృతదేహాలను అధికారికంగా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్
సైబర్ నేరగాళ్ల వలలో మాజీ ప్రొఫెసర్.. కోటి స్వాహా