Share News

మందకృష్ణ మాదిగకు గుంటూరు ఎస్పీ హామీ

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:44 AM

దళిత యువకుడు చీకటి గోపి మృతిపై సమగ్ర విచారణ జరపడానికి అదనపు ఎస్పీ రవికుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించనున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హామీ ఇచ్చినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు.

మందకృష్ణ మాదిగకు గుంటూరు ఎస్పీ హామీ

  • దళిత సంఘాలతో ఎస్పీని కలిసిన మందకృష్ణ

గుంటూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): దళిత యువకుడు చీకటి గోపి మృతిపై సమగ్ర విచారణ జరపడానికి అదనపు ఎస్పీ రవికుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించనున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హామీ ఇచ్చినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. చీకటి గోపి కుటుంబ సభ్యులు, నిజనిర్థారణ కమిటీ, దళిత ప్రజాసంఘాలతో కలిసి సోమవారం ఆయన గుంటూరులో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను కలిశారు. బంగారం చోరీ కేసులో చీకటి గోపిని తాడికొండ పోలీసులు స్టేషన్‌కు పిలిపించినప్పటి నుంచి ఆయన మరణించే వరకు చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ఈ సందర్భంగా వారు ఎస్పీకి వివరించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉండి, పది రోజుల అజ్ఞాతం అనంతరం తాజాగా బయటకు వచ్చిన గోపికృష్ణ కూడా ఎస్పీని కలిశారు. చీకటి గోపి మృతికి దారి తీసిన పరిణామాలు, ఆధారాలను తారుమారు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను ఆధారాలతో సహా ఎస్పీకి అందించామని మంద కృష్ణ తెలిపారు. చీకటి గోపి మృతికి ముమ్మాటికి తాడికొండ పోలీసులే కారణమన్నారు. ఈ కేసు విషయమై మంగళవారం ఎస్సీ కమిషన్‌ను, రాష్ట్ర హోంమంత్రిని కూడా కలుస్తామని చెప్పారు. సిట్‌ త్వరితగతిన నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 04:44 AM