బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:35 AM
ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దానిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
నేడు, రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరుగా
అమరావతి, విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దానిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు కోస్తాలో ఎక్కువ చోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా భారీగా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉత్తరకోస్తా తీరం వెంబటి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రెండు రోజులపాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
కాగా అల్పపీడనం ప్రభావంతో గురువారం కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా దార్లపూడిలో 3.7, నంగినారపాడు, వూడేరు, పరవాడలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 1.5 సెంటీమీటర్ల కురిసింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత కొనసాగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర నిధులు రాబడుతున్నాం
తగ్గిన నేరాలు.. పెరిగిన ఆన్‌లైన్ మోసాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News