తగ్గిన నేరాలు.. పెరిగిన ఆన్‌లైన్ మోసాలు
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:16 AM
రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన మొత్తం నేరాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అయితే కొన్ని తీవ్రమైన నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు మాత్రం పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.
సవాల్ విసురుతున్న రోడ్డు ప్రమాదాలు
కొన్ని జిల్లాల్లో ఇంకా ఎక్కువగానే నేరాలు
ఆందోళన కలిగిస్తున్న హత్యాయత్నాలు
మాదకద్రవ్యాల కేసులు, అరెస్టుల్లో మాత్రం తగ్గుదల
శాంతి భద్రతలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన మొత్తం నేరాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అయితే కొన్ని తీవ్రమైన నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు మాత్రం పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ల సదస్సు సందర్భంగా శాంతిభద్రతలపై జిల్లాల ఎస్పీలతో సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో మొత్తం నేరాలు తగ్గినప్పటికీ.. కొన్ని జిల్లాల్లో మాత్రం పెరుగుదల నమోదైంది. గుంటూరు, తిరుపతి, ఎన్టీఆర్ కమిషనరేట్, నెల్లూరు వంటి ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా ఉన్నాయి. తూర్పుగోదావరి, అనకాపల్లి వంటి జిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే నేరాలు పెరిగాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. హత్యలు, అపహరణలు, తీవ్ర గాయాల కేసులు తగ్గాయి. అయితే హత్యాయత్నాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆస్తి నేరాలు, దొంగతనాల కేసులు తగ్గాయి. అయితే కేసుల ఛేదన సంఖ్య, శాతం తగ్గింది. మరోవైపు రికవరీ సొత్తు వాటా కొంత మెరుగుపడింది. దీంతో నేరాల నియంత్రణతోపాటు దర్యాప్తు నాణ్యత, కేసుల ఛేదనపై మరింత దృష్టి అవసరమనే విషయం స్పష్టమవుతోంది.
ఇక ఆన్‌లైన్ మోసాలపై ఫిర్యాదులు పెరిగాయి. అయినా బాధితులకు ఆర్థిక నష్టం మాత్రం తగ్గింది. బ్యాంకుల నుంచి మోసగాళ్లకు బదిలీ కాకుండా నిలిపివేసిన సొమ్ము పెరిగింది. ఫిర్యాదుల స్వీకరణతోపాటు బాధితుల సొమ్మును వేగంగా కాపాడటం, తిరిగి ఇప్పించడం కీలకంగా మారింది. మాదకద్రవ్యాల కేసులు, అరెస్టులు కూడా తగ్గాయి. అలాగే విక్రయదారుల ఆర్థిక కార్యకలాపాలపై దర్యాప్తులు భారీగా పెరిగాయి. దీంతో మాదకద్రవ్యాల సరఫరాదారులను పట్టుకోవడంతోపాటు.. వారి ఆర్థిక మూలాలను ఛేదించడంపై పోలీసు శాఖ దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో కొంత తగ్గుదల నమోదైనప్పటికీ మొత్తం ప్రమాదాల్లో ప్రాణాంతక ప్రమాదాల వాటా పెరగడం ఆందోళనకరం. కొన్ని జిల్లాల్లో ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. ప్రమాదాల సంఖ్య తగ్గడమే కాకుండా.. ప్రాణనష్టాన్ని తగ్గించడంపై ప్రత్యేక కార్యాచరణ అవసరం ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మహిళలపై నేరాల్లో తగ్గుదల
అత్తింటి వేధింపులు, అత్యాచారాలు, మహిళలపై దాడుల కేసుల్లో మొత్తంగా తగ్గుదల కనిపించింది. రాష్ట్ర స్థాయి తగ్గుదల ఉన్నప్పటికీ.. కొన్ని జిల్లాల్లో వేధింపులు, అత్యాచారాల కేసులు పెరిగాయి. మొత్తంగా నేరాల సంఖ్య తగ్గుతున్న సమయంలోనే ముందస్తు నిరోధక చర్యలు గణనీయంగా పెరిగాయి. నిర్బంధ చట్టం కింద చర్యలు, ముందస్తు కట్టడి చర్యలు పెరిగాయి. దీనికి విరుద్ధంగా అల్లరి మూకల బహిష్కరణ చర్యలు కొంత తగ్గాయి. మొత్తం నేరాల తగ్గుదలతోపాటు.. నేరాలకు దారితీసే పరిస్థితులను ముందుగానే అడ్డుకునే చర్యలకు పోలీసు శాఖ ప్రాధాన్యం ఇస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధికి జిల్లాలే చోదక శక్తులు!
ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News