రాప్తాడు బాలిక కోలుకుంటోంది
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:22 AM
రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈమేరకు మంత్రి లోకేశ్ ఎక్స్‌లో వెల్లడించారు.
స్కూల్, టీచర్ గురించి అడిగింది.. నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది: లోకేశ్
ఆ కబురు నాకెంతో ఆనందాన్ని కలిగించింది
‘ఎక్స్’లో బాలిక స్నేహితురాలు లక్ష్మి సాహసోపేత కథ పోస్టు
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈమేరకు మంత్రి లోకేశ్ ఎక్స్‌లో వెల్లడించారు. ‘బాలిక బాగా కోలుకుంటోంది. ఈ వార్తను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమెకు కృత్రిమ శ్వాస గొట్టాన్ని తొలగించారు. స్పృహలో ఉంది. స్పందిస్తోంది. తన స్కూల్ టీచర్ గురించి ఎంతో ఆతృతగా అడిగింది. బాలిక మనోధైర్యానికి, మన వైద్యుల అద్భుతమైన చికిత్సకు ఇది చక్కటి తార్కాణం. బాలిక త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని లోకేశ్ పేర్కొన్నారు.
స్నేహితురాలి కోసం పోరాడిన లక్ష్మి
రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక త్వరగా కోలుకోవాలని రాష్ట్ర ప్రజలంతా ప్రార్థిస్తున్న సమయంలో.. తన స్నేహితురాలిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన మరో బాలిక లక్ష్మి సాహసోపేతమైన కథ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ‘ఒక ఉన్మాది రంపంతో పాఠశాలలోకి చొరబడి, తన స్నేహితురాలిపై దాడికి పాల్పడినప్పుడు లక్ష్మి భయపడి పారిపోలేదు. తన స్నేహితురాలిని కాపాడేందుకు ధైర్యంగా నిలబడింది. ఈ ప్రయత్నంలో తాను కూడా తీవ్రంగా గాయపడింది.
తనను తాను కాపాడుకునే అవకాశం ఉన్నా, స్నేహితురాలిని కాపాడేందుకే ప్రాధాన్యమిచ్చింది. నిజమైన స్నేహానికి, అసలైన ధైర్యానికి లక్ష్మి నిలువెత్తు నిదర్శనం. ప్రస్తుతం ఇద్దరు బాలికలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కష్టసమయంలో రెండు కుటుంబాలకు మా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. ఇద్దరు విద్యార్థినులకు అత్యుత్తమ వైద్యం అందేలా చూస్తాం. మున్ముందు రాష్ట్రంలో ఏ చిన్నారి కూడా తరగతి గదిలో భయపడాల్సిన పరిస్థితి రాకుండా పాఠశాలల్లో భద్రతను మరింత పటిష్ఠం చేస్తాం.
ఇద్దరు బాలికలు త్వరగా కోలుకుని మళ్లీ చిరునవ్వులతో పాఠశాలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని లోకేశ్.. లక్ష్మి సాహసోపేత కథను ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి