సంస్కరణల్లో మేమే టాప్
ABN , Publish Date - May 29 , 2026 | 04:48 AM
పార్టీలోనైనా..ప్రభుత్వంలోనైనా సంస్కరణలు తీసుకురావడంలో ముందుంటామని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్ అన్నారు.
పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా ముందుంటాం
33శాతం మహిళా రిజర్వేషన్ అమలుచేసి తీరుతాం
మీడియా, జెన్ జీతో చిట్‌చాట్‌లో మంత్రి లోకేశ్
అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): పార్టీలోనైనా..ప్రభుత్వంలోనైనా సంస్కరణలు తీసుకురావడంలో ముందుంటామని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్ అన్నారు. టీడీపీ మహానాడు రెండో రోజైన గురువారం ఆయన మీడియా ప్రతినిధులు, జెన్ జీ యువతతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు 33శాతం రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు. పార్లమెంటు చట్టంతో సంబంధం లేకుండా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది తమ పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. తాను చేసిన ఈ ప్రతిపాదనపై పార్టీలో మరింత చర్చ చేసి 2029 ఎన్నికలనాటికి తప్పకుండా అమల్లోకి తెస్తామన్నారు. దీనికి అనుగుణంగా నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తామని తెలిపారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లపై వేరే పార్టీల నిర్ణయాలపై తాను మాట్లాడనని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు రావాల్సిందేనని, జెన్‌జీ ఏం ఆశిస్తుందో.. వారి ఆశయాలు ఏమిటో దానికి అనుగుణంగా అడుగులు వేయాలని, లేకుంటే పార్టీ మారుతున్న తరానికి చేరువ కాలేదని స్పష్టం చేశారు. టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉందని తెలిపారు. జగన్ లాగా తాము ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకోమని, ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం ఉందన్నారు. ఏ ఎన్నికల్లోనైనా ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరిస్తామని తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ స్థానిక ఎన్నికల్లో ఎలా వ్యవహరించారు.. నామినేషన్ల పేపర్లు ఎలా లాక్కున్నారనేది చూశామని, అందుకనే ఆయన ఏకగ్రీవాలు చేస్తే ఊరుకోనని ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అప్పుడు ఆయన అలా చేశాడు కాబట్టే ఇప్పుడు భయపడుతున్నారన్నారు. డీఎస్సీ పరీక్షలు, నియామకాలు పూర్తయిన ఆరు నెలల తర్వాత అందులో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్, ఆయన పార్టీ నేతలు అప్పట్లోనే డీఎస్సీ పరీక్షలను ఆపించేయాలన్న లక్ష్యంతో కోర్టుల్లో ఎన్నో కేసులు వేయించారని, కోర్టు అన్ని పిటిషన్లను కొట్టేసిందని, ఒక్క చిన్న అంశంలో కూడా తమను తప్పుపట్టలేదన్నారు. డీఎస్సీలో అక్రమాలను నిరూపించేందుకు జగన్ తమతో చర్చకు రావచ్చని అన్నారు. ఆయనకు దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. డీఎస్సీలో ఎంపికైన ఒక్క టీచరైనా నాకుగానీ, ఒక్క అధికారికిగానీ ఒక్క రూపాయి ఇచ్చినట్టు నిరూపించే దమ్ము లెవన్ టీం కెప్టెన్‌కు ఉందా? అని సవాల్ విసిరారు. డీఎస్సీలో ఒక్క టీచర్‌నైనా నిబంధనలకు విరుద్ధంగా నియమించామని తీసుకొచ్చి చూపే ధైర్యం గొడ్డలి పార్టీ నేతకు ఉందా? అని ప్రశ్నించారు. జగన్ ఆయన కుటుంబ చరిత్రను ఆయనే తవ్వి తీసుకున్నారన్నారు. తాతయ్య రాజారెడ్డి చేసిన అరాచకాలు, బెరైటీస్ గనుల కోసం వాళ్లు ఎంత మం దిని హత్య చేశారనేది జనానికి తెలియజేసిన ఘనత జగన్‌దేనన్నారు. జగన్‌లా తమ దగ్గర గొడ్డళ్లు ఉండవని, పెట్టుబడులు ఎలా తీసుకురావాలన్న ఆలోచనలు మాత్రమే ఉంటాయని లోకేశ్ స్పష్టం చేశారు.


యువత రాజకీయాల్లోకి రావాలి
యువత రాజకీయాల్లోకి రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. జెన్ జీ యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. ‘‘రాష్ట్రానికి ఏఐ, క్వాంటం టెక్నాలజీలు వస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం క్లస్టర్ బేస్డ్ విధానంతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 22 కస్టర్లను గుర్తించాం. రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ. 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం’’ అని స్పష్టం చేశారు. డీఎస్సీ ప్రక్రియను 150 రోజుల్లో పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. ‘‘సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్‌ను ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నారు. ఈ విషయంలో యువత అప్రమత్తంగా ఉంటూ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. యువతకు ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తోంది. కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో తప్పితే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అది సరికాదు. ఒక్క పరీక్ష మీ జీవితాన్ని నిర్ణయించలేదనే విషయాన్ని గ్రహించాలి.’’ అని హితవు పలికారు. మహిళా సాధికారత ప్రతి ఇంటి నుంచీ మొదలవ్వాలని లోకేశ్ అన్నారు. అమ్మ భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ఈ విషయంలో స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. లోకేశ్‌కు ప్రశ్నలు వేసినవారిలో కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ నాలుగో యేడాది చదువుతున్న గుంటూరుకు చెందిన వేమూరి సాత్విక్, విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన చరణ్ యాదవ్, కేఎల్‌యూలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విజయవాడకు చెందిన సత్యసాయి పవన్ కుమార్, అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ బయోలజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఖ్యాతివర్ధిని తదితరులు ఉన్నారు.





‘నా దేశం.. నా బాధ్యత’.. మహానాడులో తీర్మానం
‘మహానాడు’ సభలో ‘నా దేశం-నా బాధ్యత’ తీర్మానాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ నినాదం ‘నా దేశం-నా బాధ్యత’ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. ‘నా గ్రామం నా బాధ్యత-నా రాష్ట్రం నా బాధ్యత-నా దేశం నా బాధ్యత’ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు న్యాయం, ధర్మం కోసం పోరాటం చేశామని, ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి టీడీపీ కార్యకర్త భాగస్వామి కావాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేశం, అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన అవసరమన్నారు. టీడీపీపై నమ్మకంతో ప్రజలు రాష్ట్ర భవిష్యత్తును మన చేతుల్లో పెట్టారని, నాయకులు, కార్యకర్తలు ప్రజలతో వినయంగా ఉంటూ ప్రభుత్వంపై విశ్వాసం పెంచాలని కోరారు.

కేంద్ర సాయం భేష్
గతంలో ఎప్పుడూ లేని విధంగా నిధులు
మహానాడులో ‘రాష్ట్రానికి కేంద్ర సాయం’పై తీర్మానం ప్రవేశపెట్టిన పెమ్మసాని
టీడీపీ మహానాడు సభలో ‘రాష్ట్రానికి కేంద్ర సాయం’ అంశంపై తీర్మానాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం తప్పనిసరని అన్నారు. ఈ వాస్తవం తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడేలా వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం నుంచి నిధులు సాధించుకుంటూ, ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ‘రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించగా.. ఇప్పటికే రూ.7,100 కోట్ల నిధులు విడుదలయ్యాయి. రాజధాని అమరావతికి వ్యతిరేకంగా నిలిచిన ఏకైక నాయకుడిగా జగన్ నిలిచిపోయారు. ఇక చరిత్రలో ఎవరూ కదిలించలేని విధంగా పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించింది. జీవనాడి పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తిచేసుకుంటున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా జగన్ ప్రభుత్వ హయాంలో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి మూతబడే పరిస్థితికి తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు సంకల్పంతో పోరాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.11,400 కోట్ల రివైవల్ ప్యాకేజీ తీసుకువచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలుచేసే కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది. ఐదేళ్లపాటు అసమర్థ పరిపాలనతో రాష్ట్రాన్ని అధోగతికి చేర్చిన వ్యక్తి జగన్. ఈ రెండేళ్లలోనే రూ.20 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకువచ్చాం. భోగాపురం ఎయిర్ పోర్టును పూర్తిచేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదే. ప్రపంచ దిగ్గజ పారిశ్రామిక సంస్థలను ఏపీకి తీసుకురావడంతో మంత్రి లోకేశ్ కృషి ఎంతో ఉంది. ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విశేష సహకారానికి కృతజ్ఞతలు’ అని పెమ్మసాని అన్నారు.