జీవనశైలి మార్పుతో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:12 AM
దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని హైదరాబాద్ అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, సీనియర్ రేడియేషన్ అంకాలజిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.పి.విజయ్ ఆనంద్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్‌రెడ్డి
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని హైదరాబాద్ అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, సీనియర్ రేడియేషన్ అంకాలజిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.పి.విజయ్ ఆనంద్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు మెడికల్ కాలేజీలో శనివారం 7వ ఏపీ రేడియేషన్ అంకాలజీ వైద్యుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న అనంతరం విజయ్ ఆనంద్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు 70 నుంచి 80 లక్షల మంది క్యాన్సర్ బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. వచ్చే పదేళ్లలో 25 నుంచి 30 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కావొచ్చన్నారు. జీవనశైలి మార్పుల వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, ఇటీవల నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్‌సీడీ) కింద హైపర్‌టెన్షన్, మధుమేహం, కార్డియాక్ కేసులతో పాటు క్యాన్సర్‌ను కూడా ఈ జాబితాలో ప్రభుత్వం చేర్చిందన్నారు.
ధూమపానం, మద్యం, పొగాకు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, నాన్‌వెజ్, జంక్ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని తెలిపారు. ప్రొటీన్ ఆహారం మాత్రమే తీసుకోవడం మంచిది కాదని, సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు. సదస్సులో ఏపీ అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ అంకాలజీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ రాష్ట్ర అధ్యక్షురాలు డా.ఎన్.సుజాత, డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డా.సాయిసుదీర్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కె.చిట్టినరసమ్మ, కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు, కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డా.సీఎస్‌కే ప్రకాశ్ పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు