ఆ ఒక్కడు..
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:43 AM
Bus fire at jammu junction నరసన్నపేట జమ్ము జంక్షన్.. ఉదయం 9.35 గంటలు.. ప్రైవేటు బస్సు వెనుక టైర్ల నుంచి పొగలు.. వెనుక వస్తున్న ద్విచక్రవాహనదారుడు గమనించాడు. వెంటనే గట్టిగా కేకలు వేశాడు. డ్రైవర్‌ను అప్రమత్తమై బస్సును ఆపేశాడు. వెంటనే బస్సులో ఉన్న వారంతా కిందకు దిగారు. ఆవెంటనే ఎయిర్ సిలిండర్లుపేలి మంటలు వ్యాపించాయి. నిమిషాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది.
పొగలు రాగానే గట్టిగా కేకలు వేసి అప్రమత్తం
ప్రాణనష్టం తప్పించిన ద్విచక్రవాహనదారుడు
ఎనిమిది మంది సురక్షితంగా దిగిన వైనం
జమ్ము జంక్షన్ వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధం
షార్ట్‌సర్క్యూట్ కారణంగా వ్యాపించిన మంటలు
నరసన్నపేట జమ్ము జంక్షన్.. ఉదయం 9.35 గంటలు.. ప్రైవేటు బస్సు వెనుక టైర్ల నుంచి పొగలు.. వెనుక వస్తున్న ద్విచక్రవాహనదారుడు గమనించాడు. వెంటనే గట్టిగా కేకలు వేశాడు. డ్రైవర్‌ను అప్రమత్తమై బస్సును ఆపేశాడు. వెంటనే బస్సులో ఉన్న వారంతా కిందకు దిగారు. ఆవెంటనే ఎయిర్ సిలిండర్లుపేలి మంటలు వ్యాపించాయి. నిమిషాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఆ ఒక్క వ్యక్తి సమయస్ఫూర్తితో ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడ్డారు.
నరసన్నపేట, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నుంచి ప్రైవేటు బస్సు శుక్రవారం రాత్రి 7.30 గంటలకు 34 మంది ప్రయాణికులతో పలాసకు బయలుదేరింది. అన్నవరం, అనకాపల్లి, విశాఖపట్నం, తగరపువలస, చిలకపాలెం, సుబద్రాపురం ప్రాంతాల్లో పలువురు ప్రయాణికులు దిగిపోయారు. శ్రీకాకుళం బస్సు బయలుదేరే సమయానికి ఐదుగురు ప్రయాణికులు మాత్రమే మిగిలారు. వీరితోపాటు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. శనివారం ఉదయం 9.35గంటల సమయంలో నరసన్నపేట సర్వీసు రోడ్డులోని జమ్ము జంక్షన్ వద్దకు రాగానే ఏసీల రెయిలింగ్ షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో బస్సు వెనుక టైర్లపై పొగలు వచ్చాయి. దీనిని బస్సు వెనుక వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారుడు గమనించాడు. వెంటనే కేకలు వేసి బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో డ్రైవర్ బస్సును పక్కకు నిలిపేశాడు. లోపల ఉన్న ఐదుగురు ప్రయాణికులు, మరో డ్రైవర్ మల్లేశ్వరరావు, క్లీనర్ కిషోర్‌తోపాటు కిందకు దిగిపోయాడు. ఇంతలో క్షణాల్లోనే ఎయిర్ సిలిండర్లు పేలి.. మంటలు వ్యాపించి.. బస్సు అంతా దగ్ధమైంది. ట్రావెల్స్ బస్సు అగ్నిజ్వాలలు చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఎస్‌ఐ గణేష్, అగ్నిమాపకశాక అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు చేపట్టారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతం దగ్గర్లోనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్.. హై ఓల్టేజ్ వైర్లు ఉన్నాయి. సకాలంలో మంటలను అదుపు చేయకపోతే ట్రాన్స్‌ఫార్మర్ పేలే ప్రమాదం ఉండడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. సరఫరా నిలిపేశారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహనరావు, నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, టెక్కలి మోటార్ వెహికల్ అధికారి సంజీవరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రాణాలతో బయటపడ్డాం
ప్రమాదం జరిగిన విషయాన్ని బస్సులో ఉన్న మేము గుర్తించలేదు. జమ్ము జంక్షన్ వద్ద స్పీడుబ్రేకర్లు ఉండటంతో బస్సు నెమ్మదిగా పోతోంది. స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో చెప్పడంతో ప్రాణాలతో బయటపడ్డాం.
- సుధాకర్, ప్రయాణికుడు, టెక్కలి
షాక్‌కు గురైయ్యాం
బస్సులో ఐదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నాం. విశాఖపట్నం నుంచి సోంపేటలో బంధువుల ఇంటికి వెళ్తున్నాం. శ్రీకాకుళంలో బస్సుడ్రైవర్లు బస్సు కండీషన్ బాగోలేదని మాట్లడుకోవడం విన్నాం. అయితే దేనికోసమో అనుకున్నాం. ప్రమాదం జరిగినట్లు తెలియడంతో షాక్‌కు గురయ్యాం.
- కామరాజు.. శుభలవతి, ప్రయాణికులు, సోంపేట