స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకే ప్రజలు పట్టం: వంగవీటి రాధ
ABN , Publish Date - Oct 25 , 2026 | 10:57 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని విజయవాడ నగర మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన వంగవీటి రాధాకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.
విజయవాడ, అక్టోబర్ 25: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని విజయవాడ నగర మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన వంగవీటి రాధాకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజా స్పందన, ఆశీర్వాదమే తనకు, తమ 86 మంది కూటమి అభ్యర్థుల విజయాన్ని తెలియచేస్తుందని అన్నారు. ఆదివారం తూర్పు నియోజకవర్గం పరిధిలోని మాచవరం, మొగల్రాజపురం, క్రీస్తు రాజపురం, గుణదల తదితర ప్రాంతాల్లో కూటమి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి వంగవీటి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ.. ఓ పక్కన అభివృద్ధి మరో పక్కన సంక్షేమంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఓ పక్కన పార్లమెంట్ సభ్యులు.. కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తున్నారని చెప్పారు. స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌తోపాటు బీజేపీ నేతలతో కలిసి ఐక్యంగా వెళ్తున్నామని పేర్కొన్నారు. మూడు పార్టీల తరఫున రిప్రజెంటేషన్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలను, నాయకులను అంతా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమకు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో 100 శాతం స్ట్రేక్ రేట్ సాధిస్తాం: ఎంపీ చిన్ని
ఈ రెండేళ్ల కూటమి పాలనలో విజయవాడ నగరంలో ఎంతో అభివృద్ధి జరిగిందని స్థానిక ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని తెలిపారు. వరదల సమయంలో సీఎం చంద్రబాబు చేపట్టిన చర్యల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని గుర్తు చేశారు. ఈ కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కారించామని తెలిపారు. గత 50 ఏళ్ల సమస్యను నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాశ్వత పరిష్కారం చూపిందని పేర్కొన్నారు.
సుమారు 26,500 కుటుంబాలకి ఈ కొండ ప్రాంతం చుట్టుపక్కల ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. సీఎం చంద్రబాబు కారణంగా నేడు అందరూ లక్షాధికారులుగా కనబడుతున్నారని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధతోపాటు తమ కూటమిలో 86 మంది అభ్యర్థులు గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరం సమన్వయంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిపాలనను ప్రజలంతా మెచ్చుకుంటున్నారని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం మరో 30 సంవత్సరాలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు దాకా డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని.. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి త్రిబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. లోకల్ బాడీలో కూడా కూటమి అధికారంలోకి వచ్చి ట్రిబుల్ ఇంజన్ సర్కార్లతో పని చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం సమపాళల్లో వెళ్లే విధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ఓటు వేస్ట్ చేయొద్దు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ అభివృద్ధి మరింత స్పీడ్‌గా జరగడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులను గెలిపించాలని నగర ప్రజలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో సాగిందని.. దీనిని ఈ కూటమి ప్రభుత్వం సరి చేసిందని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే.. మూడు ఇంజిన్లతో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏ ఓటు కూడా వేస్ట్ చేయొద్దని ప్రజలకు టీడీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని మోదీ సహకారంతో భారీగా నిధులు తెచ్చి అభివృద్ధఇ కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. ఈ ప్రభుత్వానికి మరింత చేయుతను ఇవ్వల్సిందిగా ప్రజలని ఆయన కోరారు. ఎక్కడ సైకిల్, గ్లాసు, కమలం గుర్తు కనపడినా.. వాటికి మాత్రమే ఓటు వేయ్యాలని ప్రజలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు.