Share News

పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సత్కారం

ABN , Publish Date - May 11 , 2026 | 11:14 AM

ఏపీ భవిష్యత్తు, సంపద యువతే అని కూటమి ప్రభుత్వం బలంగా నమ్ముతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మంత్రి లోకేశ్ తన విద్య అనుభవాన్ని ఉపయోగించి 100 రోజుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.

పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సత్కారం
Gadde Ramamohan

విజయవాడ, మే 11: పదో తరగతిలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో తొలి మూడు స్థానాల్లో‌ నిలిచిన విద్యార్థులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అనురాధ దంపతులు సత్కరించారు. నలభై మంది‌ విద్యార్థులను సత్కరించి, ఒక్కొక్కరికి 5 వేల రూపాయల నగదు చొప్పున రెండు లక్షల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు, సంపద యువతే అని కూటమి ప్రభుత్వం బలంగా నమ్ముతోందన్నారు. మంత్రి లోకేశ్ తన విద్య అనుభవాన్ని ఉపయోగించి 100 రోజుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ మార్కులతో విజయం సాధించారని కొనియాడారు.


రౌడీయిజం, మాఫియా, హింస ఉన్న ప్రాంతాలు, దేశాలు సర్వనాశనం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. రప్పా రప్పా అంటూ యువత జీవితాలని నాశనం చేసే పార్టీకి శాశ్వతంగా చరమగీతం పాడాలన్నారు. అటువంటి వాతావరణానికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని గమనించిన ప్రజలు, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించారన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం అనేది కేవలం వ్యక్తి కోసం కాదని.. అది రాబోయే తరాల పిల్లల భవిష్యత్తు కోసమని అందరూ గుర్తుంచుకోవాలని తెలిపారు.


యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. అమరావతి నగరం ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఉపాధి కల్పించే నగరంగా మారబోతోందన్నారు. కూటమి ప్రభుత్వం తన అజెండాలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇప్పటికే అనేకమందికి ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. రాజకీయ సిఫార్సులు, లంచాలకు తావులేకుండా, ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగానే టీచర్లను ఎంపిక చేస్తున్నారని తెలిపారు. బదిలీల విషయంలో కూడా ఇదే విధమైన పారదర్శక విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువును ఎక్కడా ఆపవద్దని... ఫీజుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు.


విద్యకున్న ప్రాధాన్యం సీఎంకు తెలుసు: గద్దె అనురాధ

మరి కొంతమందికి స్ఫూర్తిని కలిగిస్తూ దాదాపుగా 40 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సత్కారం చేశారని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన ప్రతి ఒక్కరితో పాటు, ఉపాధ్యాయులను సన్మానించారన్నారు. విద్యకు ఉన్న ప్రాధాన్యం సీఎంకు తెలుసు కాబట్టే డీఎస్‌సీలో మొట్టమొదటగా 16 వేల మంది టీచర్లను అపాయింట్ చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డీఎస్‌సీ మీదనే చేశారన్నారు. విద్యలో ఎన్నో సంస్కరణలను మంత్రి లోకేశ్ తీసుకొచ్చారన్నారు. 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులందరినీ ఆ ప్లాన్‌లోకి తీసుకువెళ్లి మంచి ఉత్తీర్ణత సాధించారని కొనియాడారు.


నేడు ప్రభుత్వ బడుల నుంచి వచ్చిన పిల్లలను పేపర్‌లో చూడటం పట్ల రాష్ట్ర ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని అనురాధ అన్నారు. మరికొంత మంది విద్యార్థులకు, ఎంతో మంది తల్లిదండ్రులకు స్ఫూర్తిని కలిగించే కార్యక్రమం ఇది అని చెప్పుకొచ్చారు. సమిష్టి కృషి, చంద్రబాబు ముందడుగు, లోకేశ్ సంస్కరణలు, ఉపాధ్యాయులు దాన్ని అనుసరించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. సాధించిన విజయాలతో సంతృప్తిపడక ముందుకు వెళ్లాలని ‘శ్రీ శ్రీ’ చెప్పినట్లు ఈ బిడ్డలంతా రేపు ఇంటర్మీడియట్‌లో కూడా రాణించాలని గద్దె అనురాధ ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి...

కర్నూలులోనే స్పోర్ట్స్ హాస్టల్: మంత్రి టీజీ భరత్

మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన స్నేహితులు.. ఏం జరిగిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2026 | 01:28 PM