Share News

లూటీకి ప్రతీక జగన్.. పెట్టుబడులు, పరిశ్రమలకు ప్రతీక చంద్రబాబు: పట్టాభి

ABN , Publish Date - Jul 10 , 2026 | 03:41 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పరిశ్రమలకు భూ కేటాయింపుల పేరుతో క్విడ్ ప్రోకో ద్వారా జగన్ కోట్లు దండుకున్నారని ఆరోపించారు.

లూటీకి ప్రతీక జగన్.. పెట్టుబడులు, పరిశ్రమలకు ప్రతీక చంద్రబాబు: పట్టాభి
Pattabhi Ram

అమరావతి, జులై 10: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పరిశ్రమలకు భూ కేటాయింపుల పేరుతో క్విడ్ ప్రోకో ద్వారా జగన్ కోట్లు దండుకున్నారని ఆరోపించారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో రాయలసీమ యువతకు ఉపాధి ఇస్తాననే భ్రమ కల్పించి భారీ దోపిడీ చేశారన్నారు. బ్రాహ్మణి స్టీల్స్‌కు 14 వేల ఎకరాల ప్రజల సొత్తు, ప్రభుత్వ భూమిని కారుచౌకగా కట్టబెట్టారని విమర్శించారు. కేటాయించిన భూములను రూ.350 కోట్లకు తాకట్టు పెట్టి భారీ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు.


రెడ్ గోల్డ్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్‌ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి జగతి పబ్లికేషన్స్‌కు రూ.44 కోట్లు, ఇందిరా టెలివిజన్‌కు రూ.30 కోట్లు వెళ్లిన విషయం వాస్తవం కాదా అని పట్టాభి ప్రశ్నించారు. కోట్లు దండుకున్నా బ్రాహ్మణి స్టీల్స్‌లో ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. 2007 జూన్ 10న బ్రాహ్మణి స్టీల్స్ శంకుస్థాపన కార్యక్రమాన్ని జగన్ స్వయంగా నడిపించారని గుర్తుచేశారు. ఓబులాపురం గనుల్లో భారీ అక్రమాలు జరిగాయని సీబీఐ స్పష్టం చేసిందని.. అయినా 2022 ఆగస్టులో ఓబులాపురం గనులపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు.


జగన్ లూటీకి గురైన 14 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని పట్టాభి వివరించారు. నాడు పరిశ్రమల పేరుతో జగన్ లూటీ చేస్తే.. నేడు పరిశ్రమలను తెచ్చి యువతకు ఉపాధి విప్లవాన్ని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వమని తెలిపారు. కియాతో ప్రారంభమైన పారిశ్రామిక ప్రగతి.. నేడు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెలార్ మిట్టల్ వంటి గ్లోబల్ సంస్థల పెట్టుబడులతో కొనసాగుతోందన్నారు. లూటీకి ప్రతీక జగన్ అయితే.. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు ప్రతీక చంద్రబాబు అని కొమ్మారెడ్డి పట్టాభి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అధిక లాభాల పేరుతో ఖాతాదారులకు టోకరా.. ఆల్మైటి జెనిసెస్ డైరెక్టర్ల అరెస్ట్

అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపేక్షించొద్దు.. పోలీస్ శాఖకు ఏపీ కేబినెట్ ఆదేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 04:17 PM