మైలవరంలో గాలివాన బీభత్సం.. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే..
ABN , Publish Date - May 26 , 2026 | 10:38 AM
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఈదురుగాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రజలను గాలివాన అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఈరోజు ఉదయం మైలవరంలో పర్యటించారు.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం నియోజకవర్గంలో నిన్న (సోమవారం) ఈదురుగాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల ప్రజలను గాలివాన అతలాకుతలం చేసింది. మైలవరం పట్టణంతో పాటు అనేక గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బలమైన గాలుల ధాటికి పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈరోజు (మంగళవారం) ఉదయం మైలవరంలో పర్యటించారు. ద్విచక్రవాహనాన్ని స్వయంగా నడుపుకుంటూ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశతో ఫోన్‌లో మాట్లాడి జరిగిన నష్టాన్ని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బాధితులకు హామీ ఇచ్చారు.
నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం మీ వెంటే ఉందని బాధితులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని అండగా నిలవాలని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాజమండ్రి: గోదావరి జలాల కాలుష్యంపై పవన్ కల్యాణ్ దృష్టి
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, 10మందికి పైగా గాయాలు..