Share News

Nimmala Ramanaidu: ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులు నిర్లక్ష్యం.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

ABN , Publish Date - Jan 06 , 2026 | 02:39 PM

రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో మాజీ సీఎం జగన్‌పై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని విరుచుకుపడ్డారు.

Nimmala Ramanaidu:  ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులు నిర్లక్ష్యం.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్
Minister Nimmala Ramanaidu

అమరావతి, జనవరి 6: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమపై జగన్, వైసీపీ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశావని అక్కడి ప్రజలే జగన్‌ను అడుగుతున్నారన్నారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. ఐదు సంవత్సరాల పాలనలో సినిమా సెట్టింగులు వేసి ఉత్తుత్తి ప్రాజెక్టులు ప్రారంభించారంటూ ఫైర్ అయ్యారు.


ఏ ప్రాజెక్ట్ చెప్పినా గుర్తొచ్చేది వారే...

రెండు రోజులు నుంచి వైసీపీ కరపత్రికలో అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రజలు మరింత ఆలోచనాపరులని, దిట్టలని... జగన్ అబద్ధాలను వారు నమ్మరన్నారు. రాయలసీమ కోసం ఎన్టీఆర్ దూరదృష్టితో వ్యవహరించారని గుర్తుచేశారు. రాయలసీమ కరవుకు సాగునీరే శాశ్వత పరిష్కారమని ఎన్టీఆర్ వాటిని ప్రారంభించారని.. చంద్రబాబు వాటిని కొనసాగించారన్నారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టు, రిజర్వాయర్ పేరు చెప్పినా గుర్తుకువచ్చేది ఎన్టీఆర్, చంద్రబాబులే అని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.


రిజర్వాయర్లు కళకళ..

ఒక సీజన్‌కు నీటిని ఉపయోగించుకున్నాక కూడా ప్రాజెక్టులలో 86 శాతం నీరు నిల్వ ఉందని తెలిపారు. 79 శాతం రాయలసీమలో నీటినిల్వ రెండవ క్రాంప్ కోసం నిల్వ ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రిజర్వాయర్లు కళకళలాడేవని.. నేడు చంద్రబాబు పాలనలో కూడా అలానే ఉన్నాయని చెప్పారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ రెడ్డి హంద్రీనీవాకు చెందిన 3500 క్యూసెక్కుల నీటిని ఎందుకు పంపింగ్ చేయలేదని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే మడకశిరకు కృష్ణా నీటిని తీసుకువెళ్ళామని నిమ్మల రామానాయుడు చెప్పారు.


ఐదేళ్లలో నిర్లక్ష్యం...

2019 - 24లో ఐదేళ్లలో రూ.514 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో రూ.3140 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రాయలసీమ ప్రాజెక్టులు ఐదేళ్లలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఫించా ప్రాజెక్టు తెగిపోయి దాని ప్రభావం అన్నమయ్య ప్రాజెక్టుపై పడుతుందని చెప్పినా జగన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీ కోసం ఫించా నుంచి వచ్చిన నీటితో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు రాయలసీమకు వెళ్లి ఎవ్వరినైనా పరామర్శించారా అంటూ నిలదీశారు.


ఆ ప్రాజెక్ట్‌కు ఒక్క రూపాయి ఇవ్వలేదు..

నాడు చంద్రబాబు ఊరూవాడా తిరిగి బాధితులకు భరోసా, ధైర్యం ఇచ్చారన్నారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ క్రుంగిపోయిందని అధికారులు చెబితే ఎందుకు పట్టించుకోలేదని జగన్‌ను నిలదీశారు. ఘోరకల్లు రిజర్వాయర్‌లో నీటిని నింపితేనే మిగిలిన ప్రాజెక్టులు నిండుతాయని.. అయినా ఆ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని... అలాంటిది జగన్ ఎలా రాయలసీమ గురించి మాట్లాడుతారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..

అవుకు రిజర్వాయర్ బండ్ కూలిపోతే తాము వెంటనే బాగుచేశామని మంత్రి అన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల భద్రత విషయంలో తుంగభద్ర ప్రాజెక్టు గేట్‌లు కొట్టుకుపోతే అక్కడికి కన్నమనాయుడును పంపారని గుర్తుచేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నీరు ఉండగానే స్టాప్ లాక్ గేట్‌ను ఐదు రోజుల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్లాంజ్ పూల్‌కు ప్రమాదమని చెబితే ఎందుకు జగన్ మరమ్మత్తులు చేయలేదని ప్రశ్నించారు. కూటమి వచ్చాక దానికి రూ.203 కోట్లు విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఎమ్మెల్సీ ఫ్లెక్సీ తొలగింపు.. ఉద్రిక్తం

‘మీ పని అద్భుతం’.. మంత్రులు, అధికారులకు సీఎం కితాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 06 , 2026 | 04:28 PM