శివనామస్మరణతో మారుమోగుతున్న పుణ్యక్షేత్రాలు..
ABN , Publish Date - Feb 15 , 2026 | 08:14 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీశైలం, ఏలూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఈ పర్వదినం సందర్భంగా భక్తుల ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందుతున్నారు...
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 15: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తజనసందోహంతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర నదులు, కోనేర్లలో స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుంటున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం భక్తులకు కనుల విందుగా నిలిచింది.
శ్రీశైలంలో ప్రభోత్సవం - నందివాహన సేవ:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రంలోని ప్రధాన వీధిలో గంగాధర మండపం వద్ద అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రభోత్సవాన్ని ప్రారంభించారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభపై ఆదిదంపతులు ఊరేగుతుండగా, భక్తులు శివనామ స్మరణతో పులకించిపోయారు.
అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివార్లకు నందివాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నందివాహనంపై కొలువుదీరిన స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. క్షేత్రంలోని ప్రధాన వీధులన్నీ 'ఓం నమః శివాయ' మంత్రంతో మారుమోగిపోయాయి. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏలూరు జిల్లా కైకలూరులో..
కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో వెలసిన శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుంటున్నారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కలిదిండి శివనామస్మరణతో మారుమోగుతోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తుల జాగారం కోసం దేవస్థానం కమిటీ భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాగే, కోనేరు వద్ద భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు (పితృతర్పణం) నిర్వహించారు.
అనంతపురంలో 18 వేల బాన లింగాలకు అభిషేకం..
అనంతపురంలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన శివ మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉజ్జయినిలోని నర్మదా నది నుండి సేకరించిన 18,000 బాన లింగాలను ఇక్కడ ప్రతిష్టించారు. భక్తులందరికీ ఈ లింగాలకు అభిషేకం చేసుకునే అరుదైన అవకాశాన్ని కల్పించారు.
ఏపీఐఐసీ (APIIC) డైరెక్టర్ చల్లా లక్ష్మీ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో భక్తులకు బాన లింగంతో పాటు అభిషేకం కిట్‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అరుణాచలం నుండి తీసుకొచ్చిన శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు రేపు ఉదయం వరకూ కళ్యాణోత్సవం, రుద్ర హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో..
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇక్కడ ఉన్న శివాలయంలో భక్తుల జాగారం కోసం ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేశారు. మర్రిమాను నీడలో వేలాది మంది భక్తులు జాగారం చేస్తున్నారు. అన్ని క్షేత్రాల్లోనూ తొక్కిసలాట జరగకుండా వాలంటీర్ వ్యవస్థ, పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా విజయవాడ యనమలకుదురులోని రామలింగేశ్వర స్వామి ప్రభ ఉత్సవాలకు భారీగా హాజరైన భక్తులు...


