Share News

చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రతిభపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:19 PM

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే ఆంధ్రులకు, తెలుగు జాతికి గౌరవం చేకూరినట్టు అవుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే ప్రస్తావనను తీసుకొచ్చారు ఎమ్మెల్యే.

చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రతిభపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే
AP Assembly Session

అమరావతి, ఫిబ్రవరి 12: ఏపీ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఆ పార్టీ నేత, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ (MLA Konatala Ramkrishna) కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా కృషి చేయాలన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే ఆంధ్రులకు, తెలుగు జాతికి గౌరవం చేకూరినట్టు అవుతుందని అన్నారు. దీనిపై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అసెంబ్లీని ఎమ్మెల్యే కోరారు.


చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రతిభపై..

అలాగే, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎమ్మెల్యే. మంత్రి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ చెస్ రంగంలో అద్భుత సాధన చేశారని తెలిపారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్'గా రికార్డు సృష్టించారని తెలిపారు. 9 చెస్ బోర్డులపై 32 పాన్‌లను 5 నిమిషాల్లో దేవాన్ష్ సాల్వ్ చేసి రికార్డు నెలకొల్పారని ఎమ్మెల్యే అన్నారు. నారా భువనేశ్వరికి 2025లో 'అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు'ను ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ఇచ్చిందని అన్నారు. నారా బ్రాహ్మణికి గోల్డెన్ పీకాక్ ఎక్సలెన్స్ అవార్డు, మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా, యూకే కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డులు లభించాయన్నారు. ఈ అవార్డులు నారా కుటుంబ సభ్యుల ప్రతిభకు అద్దం పడుతున్నాయని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.


త్రిపుల్ ఇంజిన్ సర్కార్...

రాష్ట్రం.. 25 శాతం పెట్టుబడులతో పాటు దేశ గ్రోత్ రేటును అధిగమించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల మధ్య సమన్వయంతో 'త్రిపుల్ ఇంజిన్ సర్కార్'గా పనిచేస్తోందని కొనియాడారు. విద్యుత్ చార్జీల తగ్గింపు, సీఎంకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వంటివి రాష్ట్రానికి గౌరవం తెచ్చాయన్నారు. విశాఖపట్నంలో సుమారు 5-6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాట పట్టేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అత్యంత తక్కువ ఖర్చుతో రూ.5000 కోట్లతో 30 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రూ.12 వేల కోట్లతో 4 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి జనసేన తరఫున ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్‌ కసిరెడ్డి రెగ్యులర్ బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ

అమరావతి రాజధాని కాదు.. ఆంధ్రప్రజల భవిష్యత్: ఎమ్మెల్యే వెంకట్రాజు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 01:44 PM