Share News

గుడివాడలో 48వ కార్యకర్తల సమావేశం.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం

ABN , Publish Date - Jul 18 , 2026 | 07:48 PM

తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనని, చర్యలు తప్పవని టీడీపీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం పార్టీకి చుట్టుకుంటుందని ఆయన అన్నారు. గుడివాడ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

గుడివాడలో 48వ కార్యకర్తల సమావేశం.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం
CM Chandrababu Naidu

గుడివాడ: తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనని, చర్యలు తప్పవని టీడీపీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం పార్టీకి చుట్టుకుంటుందని ఆయన అన్నారు. అలా తప్పు చేసిన వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని అన్నారు. గుడివాడ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 48వ కార్యకర్తల సమావేశంలో ఆయన ఉత్సాహంగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.


'జై తెలుగుదేశం' నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. గుడివాడలో ఒకప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందన్నారు. ఇకపై గుడివాడలో శాశ్వతంగా టీడీపీ జెండా ఎగురుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. పరిధులు లేని పిచ్చితో గొడ్డలి పార్టీ ఉందంటూ ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే విజయం శాశ్వతంగా ఉంటుందని, 360 డిగ్రీల్లో ఆలోచించి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. 2004లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఉంటే రాష్ట్ర పరిస్థితులు మరోలా ఉండేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కార్యకర్తలు అలిగినప్పుడే పార్టీ ఓడిపోయిందని అన్నారు. తనకు అతి పెద్ద కుటుంబం టీడీపీ కుటుంబమేనని ఆయన పేర్కొన్నారు.


ప్రతి రోజు ఉదయం ప్రజలతో, మధ్యాహ్నం కార్యకర్తలతో మాట్లాడుతున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. 2024 ఎన్నికల కంటే మెరుగైన మెజారిటీ రానున్న రోజుల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వారానికి మూడు గంటలు నియోజకవర్గాల వారీగా డేటా, ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తున్నానని చెప్పారు. రానున్న రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తామని సీఎం తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో 'మై హెల్త్' యాప్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. విద్య, ఉపాధి, స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు రాబోతున్నాయని వెల్లడించారు.


కార్యకర్తల అభివృద్ధికి ఈక్విటీ, రుణాల ఏర్పాటు వంటి చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చివరగా 'జై కార్యకర్త' నినాదంతో సీఎం చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.


ఇవి కూడా చదవండి..

సీదిరి అప్పలరాజు కుమారుడి కేసు.. కాశీబుగ్గ పోలీసులపై చర్యలు

భారత్ మరిన్ని విజయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Jul 18 , 2026 | 07:49 PM