Share News

ఆ వ్యాఖ్యలు నా వ్యక్తిగతం.. క్షమించండి: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

ABN , Publish Date - Feb 10 , 2026 | 08:34 PM

వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కమలం, వికసిత కూటమి.. ఇదే తమ లక్ష్యమని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి భేటీ అయ్యారు.

ఆ వ్యాఖ్యలు నా వ్యక్తిగతం.. క్షమించండి: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

విజయవాడ, ఫిబ్రవరి10 : వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కమలం, వికసిత కూటమి - ఇదే తమ లక్ష్యమని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. తిరుపతిలో కమల వికాసంపై తాను వ్యాఖ్యలు చేశానన్నారు. తాను నాలుగోసారి ఎంఎల్ఏగా గెలుపొందినట్లు గుర్తు చేశారు. తన సొంత అభిప్రాయం చెప్పానని తెలిపారు. తాను లెక్చరర్‌గా పని చేశానని.. అలాగే తాను ప్రాస మాట్లాడే వ్యక్తినని చెప్పారు. సీఎం చంద్రబాబుకు తెలియకుండా మాదే రాజ్యమని మాట్లాడే వారి కొవ్వు కరిగించాలనే తాను అలా మాట్లాడినట్లు వివరించారు.


కూటమి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని స్పష్టం చేశారు. తన ప్రాసను ప్రయాసగా మార్చారని.. ఇది మహా తప్పు అని పేర్కొన్నారు. ఈ కూటమిలో తమ బీజేపీ అధిక సీట్లు సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ధర్మ సిద్ధాంతంతో వైసీపీని తుంగలో తొక్కాలంటే తాము గట్టిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ జగన్ నుంచీ తనకు, వైఎస్ సునీతకి ప్రాణహాని ఉందన్నారు. వైఎస్ జగన్ వంటి వారు అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కూటమిని విచ్ఛిన్నం చేయాలని జగన్ కుట్రలు చేస్తూనే ఉన్నారన్నారు.


ఈ రాష్ట్రం కోసం, ప్రజల‌ కోసం.. కూటమి ఐక్యంగా ఉండాలని ఆదినారాయణ రెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి బలోపేతం కావాలని పేర్కొన్నారు. కులమతాలు మధ్యలో వచ్చాయని.. కానీ మనమంతా ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం అభివృద్ధి మాత్రమే ప్రామాణికం కావాలన్నారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే.. క్షమాపణలు తెలుపుతున్నానని చెప్పారు. తన ఉద్దేశం ఎవరినీ నొప్పించడం కాదని.. బీజేపీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.


అంతకుముందు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్‌తో ఎమ్మెల్యే ఆదినారాయణ సమావేశమయ్యారు. తిరుపతి బీజేపీ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని ఎమ్మెల్యే ఆదినారాయణ స్పష్టం చేశారు. తిరుపతి వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఖండించారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని వివరణ కోరతానంటూ పీవీఎన్ మాధవ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం విజయవాడలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి భేటీ అయ్యారు.

Updated Date - Feb 10 , 2026 | 09:30 PM