NHAI Achieves Historic Feat: ఎన్‌హెచ్ఏఐకి 4 గిన్నిస్ రికార్డులు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్న కేంద్రమంత్రి
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:00 PM
ఎన్‌హెచ్ఏఐ, రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ఆధ్వర్యంలో 6 రోజుల్లోనే 156 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగింది. జనవరి 6వ తేదీన 24 గంటల్లో 28.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ అత్యంత అరుదైన ఘనతను సాధించాయి. బెంగళూరు - విజయవాడ హైవే నిర్మాణంలో 4 గిన్నిస్ రికార్డులు నెలకొల్పాయి. ఎన్‌హెచ్ఏఐ, రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ఆధ్వర్యంలో 6 రోజుల్లోనే 156 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగింది. జనవరి 6న 24 గంటల్లోనే 28.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్‌లపై ప్రశంసలు కురిపించారు.
ఎన్‌హెచ్ఏఐ, రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సాధించిన రికార్డులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘మన ఇంజినీర్లు, అధికారులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. విజయం సాధించడంలో కృషిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. నూతన సాంకేతికతతో నాణ్యమైన రహదారుల నిర్మాణం జరగడం గొప్ప విషయం. తక్కువ సమయంలో వేగంగా రహదారుల నిర్మాణం పూర్తిచేశారు. నాణ్యత విషయంలో రాజీలేకుండా రోడ్ల నిర్మాణం జరుగుతోంది’ అని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ‘బెంగుళూరు - విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించటంపై అందరినీ అభినందిస్తున్నాను. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్థ్యం దేశంలో అందరికీ పరిచయమే. రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. నితిన్ గడ్కరీ నాయకత్వంలో ప్రపంచ స్థాయిలో ఈ రికార్డును సాధించటం గర్వకారణం. 10,655 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్ నిరంతరాయంగా వేస్తూ మరో ప్రపంచ రికార్డు సాధించారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
భారత్ నుంచి మ్యాచ్‌ల తరలింపు వివాదం.. బీసీబీకి ఐసీసీ కీలక సూచన!
అలర్ట్.. జనవరి 14న హైదరాబాద్‌లో వర్షం