Share News

ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

ABN , Publish Date - Feb 12 , 2026 | 09:20 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
Andhra Pradesh Assembly

అమరావతి, ఫిబ్రవరి 12: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పుట్టపర్తిలో ఐఐఐటీ ఏర్పాటుపై ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రశ్న లేవనెత్తారు. ఒంగోలు ఐఐఐటీ తాత్కాలిక క్యాంపస్ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇడుపులపాయ, ఒంగోలు మధ్య విద్యార్థులు తిరగాల్సి వస్తోందని, ఇది తీవ్ర ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే సింధూర రెడ్డి ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్‌ సమాధానం ఇచ్చారు. పుట్టపర్తిలో ఐఐఐటీ ఏర్పాటు ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం చేశారు.


ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సభలో ప్రస్తావించారు. సరైన అనుమతులు లేకుండానే కొందరు కాలేజీలు పెడుతున్నారని ఎమ్మెల్యే బత్తుల ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేశ్ సమాధామిస్తూ.. అక్రమాలపై వివరాలు తెలియజేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏయే కాలేజీలకు అనుమతులు ఇచ్చారనే దానిపై తన దృష్టికి తీసుకురావాలని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


అలాగే, పుత్తూరు పురపాలక సంస్థ ఛైర్మన్‌పై తప్పుడు కుల ధ్రువీకరణ ఆరోపణలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. పుత్తూరు పురపాలక సంస్థ ఛైర్మన్‌ను ఇప్పటికే తొలగించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే భాను ప్రకాశ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయో అదరికీ తెలుసని.. తప్పుడు సర్టిఫికెట్లతో పదవులు పొందారని తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రిజర్వ్‌ స్థానాలను కూడా గత ప్రభుత్వం కాజేసిందని ఆరోపిస్తూ.. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారా అని ఎమ్మెల్యే భాను ప్రకాశ్ ప్రశ్నించారు.


దీనిపై మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ.. జీవో 135లో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు. సభ్యులు అడిగినట్లు అదనపు చర్యలు ఏమి తీసుకోవచ్చో పరిశీలిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పరిధిలో అగ్నిప్రమాదం

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 10:20 AM