Share News

కోటికిపైగా ఎగవేత

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:53 AM

మండలంలోని మాలకొండ శ్రీమాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తలనీలాల పాటను దక్కించుకున్న గుంటూరు గౌతమబుద్ధ సంస్థ ప్రతినిధి రూ.కోటికి పైగానే ఎగనామం పెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన తలనీలాల వేలం పాటను ఆ సంస్థ తరఫున రూ.2.30 కోట్లకు పాడుకున్నారు.

కోటికిపైగా ఎగవేత
మాలకొండలో తలనీలాల వేలం పాట నిర్వహిస్తున్న అధికారులు (ఫైల్‌)

మాలకొండలో తలనీలాల పాటదారుడి బరితెగింపు

దుకాణం ప్రారంభంలోనే మొత్తం చెల్లించాలనేది నిబంధన

మరో 48 రోజుల్లో ముగియనున్న గడువు

ఆలయ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం

పాటదారుడికి నోటీసులు ఇచ్చిన డిప్యూటీ కమిషనర్‌

వలేటివారిపాలెం, పిబ్రవరి 11 (ఆంద్రజ్యోతి) : మండలంలోని మాలకొండ శ్రీమాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తలనీలాల పాటను దక్కించుకున్న గుంటూరు గౌతమబుద్ధ సంస్థ ప్రతినిధి రూ.కోటికి పైగానే ఎగనామం పెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన తలనీలాల వేలం పాటను ఆ సంస్థ తరఫున రూ.2.30 కోట్లకు పాడుకున్నారు. ఇప్పటి వరకూ రూ.1.30కోట్లు మాత్రమే ఆలయానికి చెల్లించారు. ఇంకా కోటి రూపాయలకు పైగానే బకాయి ఉంది. మార్చి ఆఖరుకు గత ఏడాది పాట గడువు పూర్తవుతుంది. బుధవారం జరిగిన తలనీలాల వేలం పాటలు పాడుకున్న పాటదారులు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వాటిని పోగుచేసుకుంటారు. గత ఏడాది తలనీలాలు పాడుకున్న పాటదారులు కోటి రూపాయలకు పైగానే చెల్లించాల్సి ఉంది. దీనికి ప్రధాన కారణం ఆలయ అధికారులు నిర్లక్ష్యమే. ఆలయ నిబంధనల ప్రకారం వేలం పూర్తయిన వెంటనే సగం నగదు కట్టాలి. మిగిలిన సగం పాటదారుడు దుకాణం ప్రారంభం రోజు చెల్లించాలి. అలా చెల్లించని పాటదారులకు నోటీసులు జారీ చేసి పాట లైసెన్స్‌ను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంది. అవేమీ పట్టించుకోకపోవడంతో పాటదారులు ఇప్పటి వరకూ చెల్లించలేదు. తలనీలాలతోపాటు మిగిలిన 11 రకాల అంశాల వేలం పాటలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నగదు చెల్లించలేదు. మరో 48 రోజుల్లో గత ఏడాది పాటల గడువు పూర్తవుతుంటే ఇంకా వాటి తాలూకా బకాయిల పరపరం కొనసాగుతూనే ఉంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో ఆలయానికి కోటి రూపాయలకు పైగానే నష్టంవాటిల్లింది.

Updated Date - Feb 12 , 2026 | 02:53 AM