వైసీపీ.. భయాందోళన పరిస్థితులు సృష్టిస్తోంది: మంత్రి పార్థసారథి
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:27 PM
పెట్రోల్, డీజిల్ సమస్యపై వైసీపీ భయాందోళన పరిస్థితులు సృష్టిస్తుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మండిపడ్డారు. మధ్యాహ్నం మూడు గంటలకల్లా రాష్ట్రంలో కొరత ఉన్న 75 శాతం బంకుల్లో ఆయిల్ సరఫరా చేశామన్నారు.
మచిలీపట్నం, ఏప్రిల్ 28: పెట్రోల్, డీజిల్ సమస్యపై వైసీపీ భయాందోళన పరిస్థితులు సృష్టిస్తోందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మండిపడ్డారు. మధ్యాహ్నం మూడు గంటలకల్లా రాష్ట్రంలో కొరత ఉన్న 75 శాతం బంకుల్లో ఆయిల్ సరఫరా చేశామన్నారు. బుధవారానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్యలపై కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడులో మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. అంతర్జాతీయ గూగుల్ సంస్థ విశాఖపట్నంలో శంకుస్థాపన జరుగుతున్న వేళ.. అది చూసి ఓర్వలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ శాయశక్తులా కృషి చేస్తోందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం పరిశ్రమలు తెస్తున్నారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు జరిగాయని.. ఇవన్నీ కనిపించడం లేదా? అంటూ వైసీపీ నేతలకు ఈ సందర్భంగా మంత్రి చురకలంటించారు. దేశంలో 25 శాతం పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు. 2019-24లో ఎంత మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారో మీరు మర్చిపోయారా? అంటూ వైసీపీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతిపక్షమే ఒక పెద్ద దౌర్భాగ్యంగా తయారైందని మండిపడ్డారు. వారికి చట్ట సభల్లో ప్రశ్నించే ధైర్యం లేదన్నారు. వైసీపీ కావాలనే పానిక్ సిట్యువేషన్ సృష్టిస్తోందని ఆరోపించారు. దీంతో ప్రజలు భయపడి పెట్రోల్, డీజిల్ అధికంగా కొనుగోలు చేస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ సమస్యపై సీఎం చంద్రబాబు నాయుడు రోజూ సమీక్షిస్తున్నారని మంత్రి పార్థసారథి గుర్తు చేశారు.
రైతులకు 6 నెలల్లో ఇవ్వలేని నగదును తాము 48 గంటల్లో ఇచ్చామని ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి గుర్తు చేశారు. మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. పొగాకు, కోకో, మామిడి రైతులకు నష్టం రాకుండా మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు. ధరల స్థిరీకరణకు రూ.800 కోట్లు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు.
రైతాంగ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి.. ప్రస్తుతం ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ వైసీపీ నేతల వైఖరిని మంత్రి పార్థసారథి ఎండగట్టారు. ప్రగల్బాలు మాని.. చిత్తశుద్ధి ఉంటే వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని వైసీపీ నేతలకు మంత్రి పార్థసారథి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీకి వచ్చే ప్రతి పరిశ్రమకూ అండగా ఉంటాం: మంత్రి లోకేశ్..
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: స్టీఫెన్ రవీంద్ర
For More AP News And Telugu News