నిరర్థక బోర్డులు!
ABN , Publish Date - Oct 23 , 2026 | 06:03 AM
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నిష్ర్కియాపరత్వం చాటుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడంలో గానీ, నీటి కేటాయింపుల విషయంలో గానీ నిర్ణయాలు తీసుకోకుండా..
దశాబ్దకాలం దాటినా ప్రాజెక్టుల స్వాధీనమేదీ?
తెలంగాణ నీటిని తోడేస్తున్నా నోరుమెదపని కేఆర్‌ఎంబీ
హైదరాబాద్ దాటి రాని వైనం
26న కృష్ణా బోర్డు భేటీ.. 30న జీఆర్‌ఎంబీ సమావేశం
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నిష్ర్కియాపరత్వం చాటుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడంలో గానీ, నీటి కేటాయింపుల విషయంలో గానీ నిర్ణయాలు తీసుకోకుండా నిరర్థకంగా మారాయని సాగునీటి నిపుణులు విమర్శిస్తున్నారు. జల వివాదాలు తలెత్తకుండా సామరస్యపూర్వకంగా నీటి కేటాయింపులు జరిపేందుకు వీటిని ఏర్పాటుచేశారు. కానీ ఏళ్లు గడుస్తున్నా నిర్లిప్త వైఖరి కొనసాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అలాగే కేంద్రం నుంచి సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించడంతో రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాల్సింది పోయి.. తద్భిన్నంగా పనిచేస్తున్నాయని ఆక్షేపిస్తున్నారు.
ముఖ్యంగా కృష్ణా బోర్డు ఉదాశీన వైఖరిపై మండిపడుతున్నారు. చిన్నపాటి వివాదాన్ని కూడా మరింత జటిలం చేస్తున్నాయని అంటున్నారు. విభజన చట్టం ప్రకారం గోదావరి బోర్డు ప్రధాన కార్యాలయం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో, కృష్ణా బోర్డు హెడ్‌క్వార్టర్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉండాలి. కానీ రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు దాటినా కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) ఇప్పటికీ హైదరాబాద్‌ను వీడలేదు. బోర్డు చైర్మన్లు, సభ్య కార్యదర్శులు అమరావతికి వచ్చేందుకు ఇష్టపడడం లేదు. తమకు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం సమకూర్చినట్లుగా ఉచితంగా భవనాల నుంచి ఇతర సదుపాయాలు కావాలంటూ కేఆర్‌ఎంబీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌కు ఆంధ్రప్రదేశ్ అంగీకరించి.. ఆఫీసుకు కార్యాలయాలు కూడా చూపించినా బోర్డు వైఖరి మారడం లేదు. అంతేకాదు.. నీటి కేటాయింపుల్లోనూ తగు సమయంలో నిర్ణయం తీసుకోవడం లేదు.
ప్రస్తుత ఎల్‌నినో సమయంలో తీవ్ర కరువు నెలకొంది. శ్రీశైలం జలాశయంలోని నీటిని తాగు అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ తెలంగాణ ఎడమ గట్టు కేంద్రం ద్వారా యథేచ్ఛగా విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తోంది. దీంతో రాయలసీమ దాహార్తి ప్రశ్నార్థకమవుతోంది. ఈ విషయంలో తెలంగాణను నిలువరించేందుకు కృష్ణా బోర్డు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. జలాశయంలో మిగిలిన నీటిని ఉభయ రాష్ట్రాలకు కేటాయించడంలో తాత్సారం చేస్తోంది. దీంతో తెలంగాణ ఇష్టానుసారం నీటిని తోడేస్తోంది. కేఆర్‌ఎంబీ కఠిన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేఆర్‌ఎంబీ ఈ నెల 26న మరోసారి రెండు రాష్ట్రాలతో సమావేశం కానుంది. అటు గోదావరి బోర్డు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తోందని ఏపీ విమర్శిస్తోంది.
గోదావరి నీటి లెక్కలు తేలకుండా గోదావరి-కావేరి అనుసంధన పథకాన్ని తెలంగాణ నుంచి చేపట్టాలన్న నిర్ణయాన్ని తీసుకోవద్దని కోరుతోంది. జలాల లభ్యత, నీటి లెక్కలు తేలకుండా తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం క్లియరెన్సులు ఇవ్వడాన్ని ఇప్పటికే తప్పుబట్టింది. ఈ కేటాయింపులు పునఃసమీక్షించాలని డిమాండ్ చేయడంతో జలసంఘం ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. వీటిపై స్పష్టత రాకుండానే గోదావరి బోర్డు ఈ నెల 30వ తేదీన సమావేశానికి సిద్ధమైంది.
ఈ వార్తలనూ చదవండి: