Share News

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన తమిళనాడు మత్స్యకారుల బోటు.. నలుగురి మృతదేహాల గుర్తింపు

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:34 PM

ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్ తీరంలో కలకలం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో కొట్టుకొచ్చి తీరానికి చేరింది.

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన తమిళనాడు మత్స్యకారుల బోటు.. నలుగురి మృతదేహాల గుర్తింపు
Tamil Nadu Fishermen

ప్రకాశం, నవంబర్ 5: జిల్లాలోని కొత్తపట్నం సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో బోల్తా పడటంతో తొమ్మిది మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే నలుగురి మృతదేహాలు కొత్తపట్నం సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. మిగిలిన వారి ఆచూకీ కోసం అధికారులు.. సహాయక బృందాలు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ నెల 3వ తేదీన నిజాంపట్నం నుంచి రామాయపట్నం వైపు వెళ్తుండగా కొత్తపట్నం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సముద్రంలో అలల ఉద్ధృతికి మత్స్యకారుల బోటు బోల్తా పడినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన బోటు తీరానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో సముద్రంపై తేలుతూ కనిపించింది. ఈ బోటు తమిళనాడులోని కాశీమేడ్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. తొమ్మిది మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతు కావడం.. వారిలో నలుగురు మృత్యువాత పడటంతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.


మత్స్యకారుల వివరాలు ఇవే..

ఈ ప్రమాదంలో గల్లంతైన తొమ్మిది మంది తమిళనాడు మత్స్యకారులను సూర్య (49), కుప్పన్ (48), మోహన్ (47), రాజేష్ (52), మురుగన్ (48), కుప్పుస్వామి (58), విజయ్‌కాంత్ (44), అరవింద్ (40), నారాయణ (57)గా గుర్తించారు. వీరిలో సూర్య బోటు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నాలుగు మృతదేహాలు తీరానికి చేరుకోగా.. మిగిలిన ఐదుగురి ఆచూకీ కోసం అధికారులు సముద్రంలో గాలింపు ముమ్మరం చేశారు. బోటు ప్రమాదం జరిగిన పరిస్థితులు, మత్స్యకారులు గల్లంతైన తీరుపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సముద్రంలో కొనసాగుతున్న గాలింపు చర్యలపై బాధిత కుటుంబాలు ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 01:50 PM