వైసీపీ నిరసనలు కాదు.. ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:06 AM
వైసీపీ చేపడుతున్న నిరసనలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు.. నేతలు ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.
అమరావతి, ఆగస్టు 7: వైసీపీ చేపడుతున్న నిరసనలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం నష్టపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. గతంలో వైసీపీ ఇవ్వలేని టీచర్ ఉద్యోగాలను మంత్రి నారా లోకేశ్ అందించారని పేర్కొన్నారు. రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిన చరిత్ర వైసీపీదేనని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు భారీ పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
టీచర్ ఉద్యోగాల విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలను రుజువులతో నిరూపిస్తే గంటలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కోటంరెడ్డి సవాల్ విసిరారు. ఉద్యోగాల నియామకాలను అడ్డుకునేందుకు హైకోర్టులో వందల కేసులు వేశారని, కోర్టు మందలించినా వైసీపీ వైఖరిలో మార్పు రావడం లేదని ఆరోపించారు. బోరుగడ్డ అనిల్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, గతంలో తనపై చేసిన వ్యాఖ్యలకు తగిన పరిణామాలు ఎదురయ్యాయని కోటంరెడ్డి అన్నారు. మాట్లాడే సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని.. లేకుంటే ప్రకృతి, దేవుడి తీర్పు తప్పదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు వైసీపీ కుట్రలు: కొమ్మారెడ్డి పట్టాభి
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ అన్నారు. అసాంఘిక శక్తులను అడ్డం పెట్టుకుని జనజీ పేరుతో దీక్షలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడపడితే అక్కడ నిరసనలు చేపడుతున్నారని విమర్శించారు. మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద ఘటనపై వైసీపీ వైఖరిని ప్రశ్నించిన పట్టాభి.. దేవరపల్లి ఘటనను ప్రస్తావిస్తూ ఆ పార్టీపై విమర్శలు చేశారు. వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల వెనుక రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్‌లు ఉన్నాయని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంపై తమకు గౌరవం ఉందని, అందుకే సంయమనంతో వ్యవహరిస్తున్నామని పట్టాభి తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఒక్కటిగా వస్తే వైసీపీ తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాల్‌ను స్వీకరించే ధైర్యం జగన్‌కు లేదని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని.. ఇదే విషయంపై హైకోర్టు కూడా వైసీపీని ప్రశ్నించిందని పట్టాభి పేర్కొన్నారు. దమ్ముంటే జగన్ చర్చకు రావాలని, లోకేశ్ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
బోఫోర్స్ కేసు.. చివరి పిటిషన్‌నూ కొట్టేసిన సుప్రీం కోర్టు
ట్రంప్ కొత్త ఆదేశాలు.. జన్మతః పౌరసత్వ నిబంధనలు మరింత కఠినతరం
Read Latest AP News And Telugu News