Share News

దళిత నిరు పేదరాలికి ‘జడ్పీ’ పీఠం!

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:26 AM

ఎన్టీఆర్‌ జిల్లా పరిషత్‌ పీఠం ఓ దళిత నిరు పేదరాలికి దక్కనుంది. జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కోట పుల్లమ్మ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం.

దళిత నిరు పేదరాలికి ‘జడ్పీ’ పీఠం!

ఎన్టీఆర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా కోట పుల్లమ్మ?

ఎంటెక్‌ పట్టభద్రురాలు..సర్పంచ్‌గా రాణింపు

ఎన్టీఆర్‌లోని 16 జడ్పీల్లో 13 టీడీపీ సొంతం

విజయవాడ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ జిల్లా పరిషత్‌ పీఠం ఓ దళిత నిరు పేదరాలికి దక్కనుంది. జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కోట పుల్లమ్మ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇక్కడ జడ్పీని ఈసారి ఎస్సీ కేటగిరీకి కేటాయించారు. ఎన్టీఆర్‌ జిల్లా పరిషత్‌లోని 16 జడ్పీటీసీల్లో 13 టీడీపీ సొంతం చేసుకుంది. కూటమిలోని బీజేపీ ఒక చోట గెలిచింది. వైసీపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుల్లమ్మ గెలిచారు. జనరల్‌కు కేటాయించిన ఈ స్థానంలో 6,851 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు.

పుల్లమ్మ ఉన్నత విద్యావంతులు. ఎం.టెక్‌ పూర్తి చేసిన ఆమె, స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. 2021-2026 వరకు గంపలగూడెం గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. వైసీపీ గాలిలో కూడా టీడీపీ తరఫున పోరాడి గెలిచిన చరిత్ర ఆమెకు ఉంది. 2024- 2026 వరకు దిశ కమిటీ సభ్యురాలుగా మహిళా భద్రత, హక్కుల రక్షణ, సంక్షేమానికి కృషి చేశారు. ఉన్నత విద్యావంతురాలు కావడంతోపాటు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో పుల్లమ్మ రాణిస్తున్న తీరు అధిష్ఠానాన్ని ఆకట్టుకున్నట్టు తెలిసింది.

పరిపాలనా అనుభవంతోపాటు, సాంకేతిక విషయాల్లోనూ మంచి అవగాహన ఉండటం ఆమె వైపు మొగ్గడానికి కారణమైందని తెలిసింది. ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం ఆమెకు ఉందని జిల్లా నాయకత్వం గుర్తించింది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవికి ఆమె పేరును ఏకగ్రీవంగా అధిష్ఠానానికి ప్రతిపాదించింది.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 01:29 AM