Share News

కమాల్‌ ‘కియా’

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:00 AM

అమ్మవారుపల్లి.. పదేళ్ల క్రితం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక కుగ్రామం. పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈ గ్రామం ఆ జిల్లాలోనే చాలా మందికి పెద్దగా తెలియదు. ఆ ఊరిలో ఎక్కువగా పూరి గుడిసెలు ఉండేవి. ఊరి చుట్టూ బీడు భూములు. చేస్తే వ్యవసాయం, లేదంటే పొట్ట చేతపట్టుకుని వలసలు. బోరుబావులు తవ్వినా చుక్కనీరు పడేదికాదు.

కమాల్‌ ‘కియా’

  • ఒక్క పరిశ్రమ తెచ్చిన వంద మార్పులు

  • కియ రాకతో మారిన స్థానిక పరిస్థితులు

  • అమ్మవారుపల్లికి మహర్దశ

  • నాడు పొట్టకూటికి తిప్పలుపడిన జనం

  • నేడు ఆ ఊరంతా కోటీశ్వరులే

  • భూముల ధరలు లక్షల నుంచి కోట్లకు

  • కియ కంపెనీలో ఇంటికొకరికి ఉద్యోగం

  • కాకా హోటల్‌ కూడా లేని గ్రామంలో

  • ప్రస్తుతం హైఫై కొరియన్‌ హోటళ్లు

  • చుట్టుపక్కలా ఖరీదైన భవంతులు

  • క్రమేణా విస్తరిస్తున్న అనుబంధ కంపెనీలు

  • ఎంఎస్ఎంఈలతో మహిళలకూ ఉపాధి

  • ఉమ్మడి అనంత జిల్లాలో అభివృద్ధి మార్క్‌

ఎక్కువగా పూరి గుడిసెలు, చుట్టూ బీడు భూములున్న గ్రామంలో అందరూ ఏకంగా కోటీశ్వరులైతే..! కాకా హోటల్‌ కూడా కనబడనిచోట విలాసవంతమైన హోటళ్లు వెలిస్తే..! వలసలు తప్ప మరో మార్గం లేని వారికి అక్కడే ఉద్యోగాలు వస్తే..! పదేళ్ల నాటి కుగ్రామం ఊహించని విధంగా స్మార్ట్‌ సిటీగా రూపాంతరం చెందితే..! అల్లావుద్దీన్‌ అద్భుత దీపం దొరికితే గానీ సాధ్యం కాదంటారా..? కానీ ఇది నిజం.

స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందుతున్న ఆ గ్రామం.. ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అమ్మవారుపల్లి. ఇప్పుడు ఇంతటి మహర్దశ రావడానికి కారణం.. కియ కంపెనీ. నాడు చంద్రబాబు హయాంలో ఇక్కడికి కియ కార్ల పరిశ్రమ రావడంతో ఒక్క అమ్మవారుపల్లి మాత్రమే కాదు చుట్టు పక్కల ప్రాంతాల రూపురేఖలూ మారిపోతున్నాయి. కియతో పాటు క్రమేణా అనుబంధ పరిశ్రమలూ వచ్చాయి. అక్కడ పేదరికం పోయింది. ఎంతోమందికి ఉపాధి దొరికింది. ప్రజల జీవన స్థితిగతులు ఎంతో మెరుగయ్యాయి. పరిశ్రమల రాకతో ఓ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.


పరిశ్రమ... అంటే కేవలం పెట్టుబడి కాదు! కొందరికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, మరికొందరికి పరోక్షంగా ఉపాధి కల్పించేది మాత్రమే కాదు! ప్రభుత్వానికి పన్ను ఆదాయం తెచ్చి పెట్టేందుకే పరిమితం కాదు! ఒక్క విజయవంతమైన పరిశ్రమ... ఆ ప్రాంత ముఖ చిత్రాన్నే మార్చేస్తుంది. భూములను బంగారంగా మార్చుతుంది. పేద రైతులను ధనికులుగా మార్చేస్తుంది. స్థానికుల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం... కియ! ఈ ఒక్క పరిశ్రమ రాకతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కియ కార్ల ఫ్యాక్టరీ తెచ్చిన మార్పులపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

(అనంతపురం ఉన్నత విద్య/పెనుకొండ రూరల్‌-ఆంధ్రజ్యోతి)

అమ్మవారుపల్లి.. పదేళ్ల క్రితం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక కుగ్రామం. పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈ గ్రామం ఆ జిల్లాలోనే చాలా మందికి పెద్దగా తెలియదు. ఆ ఊరిలో ఎక్కువగా పూరి గుడిసెలు ఉండేవి. ఊరి చుట్టూ బీడు భూములు. చేస్తే వ్యవసాయం, లేదంటే పొట్ట చేతపట్టుకుని వలసలు. బోరుబావులు తవ్వినా చుక్కనీరు పడేదికాదు. తాగునీటికే ఇబ్బంది ఉండే చోట సాగునీరు అనే ఆలోచనే లేదు. కొత్తవారు ఎవరైనా వస్తే టీ తాగేందుకు చిన్నపాటి కొట్టు, తినడానికి కాకా హోటల్‌ కూడా కరువే. సుమారు 200 కుటుంబాలతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. నాడు ఆ గ్రామ ప్రజల పరిస్థితి ఇదీ. సీన్‌ కట్‌ చేస్తే.. కియ కార్ల పరిశ్రమ రాకతో ఆ గ్రామం పరిస్థితి, రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆ ఊరిలో పేదరికం మాయమైపోయింది. భూముల ధరలు పెరిగాయి. ఎకరం పొలం ఉన్న రైతు కూడా కోటీశ్వరుడయ్యాడు. ప్రతి ఇంట్లో కనీసం ఒకరు ఉద్యోగి అయ్యారు. కాస్త ఎక్కువ భూమి ఉన్నవారు వ్యాపారవేత్తలయ్యారు. ప్రస్తుతం ఆ ఊరు ఓ స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందుతోంది..! ఆ ఊరి ఖ్యాతి రాష్ట్రం, దేశం దాటి ఏకంగా ఖండాంతరాలకు విస్తరించింది. కొరియన్లకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారింది. ఒకప్పుడు రైతులు, కూలీలు కనిపించిన చోట.. సూటు, బూటు వేసుకుని ఖరీదైన కార్లలో తిరిగే కొరియన్లు కూడా ఉంటున్నారు. ఖరీదైన భవనాలు, హోటళ్లు, అపార్ట్‌మెంట్లు కళకళలాడుతున్నాయి.


ఊహించని అభివృద్ధి

అమ్మవారుపల్లిలో ఒకప్పుడు సరైన రోడ్లు ఉండేవికావు. తాగునీరు దొరికేదికాదు. కియ రాకతో పదేళ్లలో క్రమంగా స్మార్ట్‌ సిటీగా రూపాంతరం చెందుతోంది. పూరి గుడిసెలు మాయమై.. వాటి స్థానంలో విశాలవంతమైన భవంతులు, అపార్ట్‌మెంట్లు వచ్చేశాయి. గతుకుల రోడ్లు సీసీ రోడ్లుగా మారిపోయాయి. కియ సహకారంతో తాగునీటి ట్యాంకులు, ఫిల్టర్‌ వాటర్‌ ప్లాంట్లు వెలిశాయి. జనాభా పెరగడంతో పాటు అన్ని రకాల దుకాణాలు వెలుస్తున్నాయి. కియతో పాటు దాని అనుబంధ సంస్థలు, చిన్నస్థాయి కుటీర పరిశ్రమలతో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇక్కడికి వస్తున్న ఓ స్థాయి పెట్టుబడిదారులు స్థానికంగా ఉంటూ కియ అనుబంధ సంస్థల నుంచి చిన్నచిన్న డీలర్‌షిప్‌లు తీసుకున్నారు. మరికొందరు చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నారు. ఎంఎస్ఎంఈ పథకం కింద పరిశ్రమలను నెలకొల్పారు. కార్ల విడిభాగాలను భద్రపరిచేందుకు తయారు చేసే కవర్‌ మేకింగ్‌ పరిశ్రమలు, ఇంజన్‌, కార్‌ బాడీని భద్రపరిచే బబుల్‌ కవర్‌, ఫోమ్‌ పార్టేషన్‌ తదితర పరిశ్రమలు ఇక్కడ ఏర్పడ్డాయి. ఇలా అమ్మవారుపల్లి కమర్షియల్‌ ఏరియాగా మారిపోయింది. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

కియ, అనుబంధ పరిశ్రమలు

2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కియ కార్ల పరిశ్రమను పెనుకొండ ప్రాంతానికి తీసుకొచ్చారు. అంతకుమునుపే అక్కడ గొల్లపల్లి రిజర్వాయర్‌ నిర్మించారు. హంద్రీ-నీవా నీరు వచ్చింది. పెనుకొండ మండలం అమ్మవారుపల్లి సమీపంలో దాదాపు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కియ పరిశ్రమ ఏర్పాటైంది. 2019లో ట్రయల్‌రన్‌, ప్రారంభోత్సవం జరిగాయి. ప్రస్తుతం ఏడాదికి 4.30 లక్షల నుంచి 5 లక్షల కార్లు తయారీ చేస్తున్నారు. 94 దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. కంపెనీలో లక్ష మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో తెలుగువారు దాదాపు 30 వేలమంది ఉన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు భూములిచ్చిన గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కియ కంపెనీ ఉద్యోగాలు ఇచ్చింది. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం లభించింది. కొన్ని కుటుంబాలలో ఇద్దరు ముగ్గురు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక తమిళనాడుకు చెందినవారు అత్యధికంగా 40 వేలమంది పనిచేస్తున్నారు. బిహార్‌, రాజస్థాన్‌ ఇతర రాష్ట్రాలకు చెందినవారూ ఉన్నారు. ఇక కియ తర్వాత క్రమేణా 27 అనుబంధ కంపెనీలు వచ్చాయి. దాదాపు 1200 ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 25-30 వేలమందికి ఉపాధి లభించింది. మహిళలకూ ఉపాధి అవకాశం వచ్చింది.


సిటీ కల్చర్‌

అమ్మవారుపల్లిలో ప్రస్తుతం విలాసవంతమైన హోటళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. కొరియన్ల కోసం రోజుకు రూ.2,200 నుంచి రూ.10 వేల వరకూ అద్దెలతో లగ్జరీ రూములున్న సువిశాలమైన హోటళ్లు వెలిశాయి. వారికోసం విలాసవంతమైన గృహాలు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు నిర్మించారు. ఏ2బీ, సుసాన్‌ సూట్స్‌, సియోల్‌ స్టోర్స్‌ ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై వెళ్లేవారు ఇక్కడి హోటళ్లలో రుచిచూస్తున్నారు. నేపాల్‌, జపాన్‌ నుంచి ప్రత్యేకంగా చెఫ్‌లను రప్పించి ప్రత్యేక నాన్‌వెజ్‌ వంటకాలను సిద్ధం చేయిస్తున్నారు. ఇక కొరియన్ల కోసం ఏకంగా ఓ స్నాక్స్‌ స్టోర్‌ను నిర్మించారు.

భూముల ధరలకు రెక్కలు

అమ్మవారుపల్లిలో రైతులు వ్యాపారులుగా మారిపోయారు. భూములు ఇచ్చినవారికి కియ కంపెనీ, అప్పట్లో ఎకరానికి రూ.10లక్షలకు పైగా పరిహారం చెల్లించింది. నాడు అక్కడ ఎకరం రూ.5 లక్షలు కూడా పలికేది కాదు. రెట్టింపు పరిహారం రావడంతో ఆ డబ్బుతో కొందరు అక్కడే హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించుకున్నారు. మరికొందరు కియ అనుబంధ సంస్థలకు భవంతులు నిర్మించి అద్దెకు ఇచ్చారు. కొందరు వ్యాపారాలను ప్రారంభించారు. ఇలా వచ్చే ఆదాయంతో సమీప ప్రాంతంలో భూములు కొనుగోలుచేశారు. ఇప్పుడు వాటి విలువ ఎకరం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లు పలుకుతోంది. అమ్మవారుపల్లి మొదలు పెనుకొండ వరకూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది. నిత్యం కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. కియ అనుబంధ సంస్థలు మరిన్ని వస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ధరలు మరింత పెరిగాయి. భూములు అమ్మేవారు, కొనేవారితో సందడి కనిపిస్తోంది.


మొదటి భూదాత నేనే

మా ఊరికి కియ పరిశ్రమ వస్తుందంటే అప్పట్లో ఎవరూ పెద్దగా నమ్మలేదు. చంద్రబాబు హయాంలో ముందడుగు పడింది. భూసేకరణ చేశారు. నా వద్దనున్న 12 ఎకరాల భూమిని కియ పరిశ్రమకు ఇచ్చాను. భూమి ఇచ్చిన వారిలో మొదటి వ్యక్తి నేనే. ఎకరానికి రూ.10.50 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చారు. అలా వచ్చిన డబ్బుతో నా కొడుకులకు కాంప్లెక్స్‌ నిర్మించి ఇచ్చాను. నెలనెలా అద్దెల రూపంలో రూ.3.50 లక్షలు వస్తోంది. కియ కంపెనీ వాళ్లతో మాట్లాడి మా ఊరిలో రూ.1.20 కోట్లతో సోలార్‌ లైట్లు, వాటర్‌ ట్యాంకులు, రోడ్లు నిర్మించేలా చేశాను. ఇప్పుడు అమ్మవారుపల్లి అంటే పల్లె కాదు.. సిటీ!

- ఎమ్మెల్యే వెంకటరెడ్డి, రైతు, అమ్మవారుపల్లి

నాలుగేళ్ల క్రితం కంపెనీ ప్రారంభించా

మాది అరుణాచలం. కార్లను కప్పే కవర్ల తయారీ కంపెనీ డీలర్‌షిప్‌ను అనుబంధ సంస్థ నుంచి తీసుకున్నాను. ఎంఎస్ఎంఈ కింద కంపెనీని ప్రారంభించాను. మొదట్లో మిషనరీ, మెటీరియల్‌ అంతా కలిపి రూ.కోటి వరకూ వ్యయం చేశాను. మొదట 10 మంది మహిళలు పనిచేసేవారు. ఇప్పుడు మా వద్ద 20 మందికిపైగా పనిచేస్తున్నారు. మా సంస్థ ఆధ్వర్యంలో కార్ల ఇంజన్‌, బాడీ తదితర కవర్లను తయారు చేస్తున్నాం.

- తిరుమలై, కంపెనీ ఇన్‌చార్జ్‌, అరుణాచలం

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 03:00 AM