మద్యం రవాణా స్కాంలో.. కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి బెయిల్
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:23 AM
ఏపీ మద్యం రవాణా టెండర్ల స్కాం కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న కీలక నిందితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు ఈడీ కేసుల ప్రత్యేక కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని గురువారం స్పష్టంచేసింది.
షరతులు విధించిన ఈడీ ప్రత్యేక కోర్టు
ఈ కేసులో అంబటి సన్నిహితులను విచారించిన అధికారులు
త్వరలో మరికొందరు కీలక వ్యక్తుల అరెస్టు?
విచారణకు అంబటి గైర్హాజరు
స్టెంట్లు వేయించుకున్నానని.. పూర్తిగా కోలుకున్నాక వస్తానని ఈడీకి లేఖ
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం రవాణా టెండర్ల స్కాం కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న కీలక నిందితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు ఈడీ కేసుల ప్రత్యేక కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని గురువారం స్పష్టంచేసింది. రూ.లక్ష చొప్పున ఒకొక్కరు రెండు ష్యూరిటీలు సమర్పించాలని, ఈడీ విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతులు విధించింది. మరోవైపు.. ఇదే కేసుకు సంబంధించి నలుగురిని ఈడీ అధికారులు విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సన్నిహితులైన ఆ పార్టీ నాయకులు మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తమరావు, ఈయన కంపెనీ ఉద్యోగి నగేశ్‌తో పాటు మరొకరిని ఈడీ అధికారులు విచారించి వాంగ్మూలాలు నమోదుచేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం రవాణా చేసేందుకు ప్రధాన కాంట్రాక్టు దక్కించుకున్న సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ నుంచి సుబ్బారెడ్డి, పురుషోత్తమరావు సబ్‌కాంట్రాక్టులు పొందడంలో అంబటి కీలక పాత్ర పోషించారని సిట్ ఇప్పటికే తేల్చింది. రెండు టెండర్లలో కలిపితే 74.51 లక్షల మద్యం పెట్టెల రవాణా, రూ19.58 కోట్ల చెల్లింపుల లెక్క దర్యాప్తు రికార్డుల్లోకి వచ్చింది.
దీనిపై ఈడీ అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. మద్యం రవాణా ధరలను అపరిమితంగా పెంచి నిందితులు ప్రభుత్వం నుంచి అనుచిత పద్ధతుల్లో రూ.195 కోట్లు కాజేశారని.. ఈ మొత్తాన్ని వివిధ మార్గాల్లో మళ్లించారంటూ మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. నిందితుల విచారణలో వెల్లడవుతున్న అంశాల ఆధారంగా మరికొంతమంది కీలక వ్యక్తుల అరెస్టుకు ఈడీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకు తగిన సాక్ష్యాధారాలను పూర్తి స్ధాయిలో సేకరించినట్లు తెలిసింది. ఈ రూ.195 కోట్లలో ఎవరి వాటా ఎంత.. అంతిమంగా ప్రధాన వాటా ఎవరికి చేరింది.. ఏయే మార్గాల్లో మనీరూటింగ్ జరిగిందో ఇప్పటికే ఈడీ అధికారులు స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.
విచారణకు అంబటి డుమ్మా..
మద్యం రవాణా స్కాంలో అంబటి రాంబాబు గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరవ్వాల్సి ఉంది. కానీ ఆయన రాలేదు. గుండెకు స్టెంట్లు వేయించుకున్నానని.. ఆ కారణంగా రాలేకపోతున్నట్లు ఆయన ఈడీకి లేఖ రాశారని సమాచారం. శుక్రవారం తప్పనిసరిగా రావాలని ఈడీ అధికారులు చెప్పగా.. పూర్తిగా కోలుకున్న తర్వాతే వస్తానని అంబటి తెలియజేసినట్లు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి...