కన్నుల పండువగా తెప్పోత్సవం
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:02 AM
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. అమ్మవారు విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
హంస వాహనంపై విహరించిన శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి
శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన శరన్నవరాత్రులు
విజయవాడ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. అమ్మవారు విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి దర్శనానికి అనుమతించారు. రాత్రి వరకు క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. రాత్రి 12 గంటల సమయానికి 1,51,732 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రుల్లో మొత్తం 15,05,359 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 11న దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 11వ తేదీన 1,47,242, 12న 1,50,437, 13న 1,44,467, 14న 1,17,802, 15న 1,27,178, 16న 2,32,018, 18న 1,54,871, 19న 1,47,354, 20న 1,51,732 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా.. విజయదశమి రోజు ఉదయం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రికి జమ్మిదొడ్డిలో శమీపూజ చేశారు. మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా దుర్గాఘాట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ హంస వాహనంపై ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తులను హంస వాహనంపై నదిలో విహరింపజేశారు.
ఈ వార్తలనూ చదవండి