బాబాయి మృతి తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.. ఒకేసారి ఇద్దరి అంత్యక్రియలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 10:31 AM
ప్రకాశం జిల్లా కంభంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాబాయి మృతిని తట్టుకోలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది..
మార్కాపురం, ఆగస్టు 8: ప్రకాశం జిల్లా కంభంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాబాయి మృతి చెందడాన్ని తట్టుకోలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బాబాయి మణికుమార్ మృతి చెందిన విషయం తెలుసుకున్న క్లైమ్ బాబు అనే యువకుడు.. తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాధలోనే కంభం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఒకే కుటుంబంలో వరుసగా ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మణికుమార్ కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ మణికుమార్ మృతి చెందారు.
బాబాయి మృతి వార్త క్లైమ్ బాబును తీవ్రంగా కలిచివేసినట్లు తెలుస్తోంది. బాబాయితో ఉన్న అనుబంధం కారణంగా ఆయన మృతిని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన క్లైమ్ బాబు.. కంభం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మణికుమార్, క్లైమ్ బాబు మృతదేహాలకు కుటుంబ సభ్యులు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే కుటుంబంలో ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి జరగడం చూసి స్థానికులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన కంభం ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి..
డూప్లెక్స్ ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం..