Share News

అక్రమాస్తుల కేసు.. ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అధికారిణి శాంతి?

ABN , Publish Date - Apr 09 , 2026 | 07:57 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమెను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అక్రమాస్తుల కేసు.. ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అధికారిణి శాంతి?
Kalingiri Shanthi ACB Custody Case

విజయవాడ, ఏప్రిల్ 9: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమెను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అక్రమ ఆస్తుల వ్యవహారంలో మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు శాంతిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఏసీబీ కోరింది. సోదాల సమయంలో లభించిన పత్రాలు, ఆస్తుల వివరాలపై ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు (గురువారం) ఏసీబీ న్యాయస్థానం విచారణ జరపనుంది.

సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న కొన్ని స్థిరాస్తులు, డాక్యుమెంట్ల గురించి శాంతి స్పష్టమైన వివరణ ఇవ్వలేదని, ఆమె నోరు విప్పితే మరిన్ని అక్రమాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. గ్రూప్-1 ఆఫీసర్‌గా ఎంపికై దేవాదాయ శాఖలో చేరిన నాటి నుంచే ఆమె భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేసిన సమయంలో ఆమె ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది.


గత కొన్ని రోజులుగా కళింగిరి శాంతి నివాసాలు, బంధువుల ఇళ్లలో జరిగిన సోదాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడిన సంగతి తెలిసిందే. విధుల్లో చేరిన తక్కువ కాలంలోనే ఒక గ్రూప్-1 అధికారి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. నేడు కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా శాంతిని ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో మరికొంత మంది దేవాదాయ శాఖ అధికారుల హస్తం ఉందా లేదా అనే విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2026 | 09:02 AM